logo
Published : 03/12/2021 03:18 IST

నిబంధనలు గాలికొదిలేశారు

మాస్కుల్లేక స్వేచ్ఛగా తిరిగేస్తున్న వైనం

జిల్లాకేంద్రంలోని వీక్లీమార్కెట్లో గురువారం నిర్వహించిన వార సంతకు వేలల్లో రాగా అందులో 60శాతం మందికి మాస్కులు లేవు. ఇక్కడ ప్రతి వారం రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతోంది. ఇంత రద్దీ ప్రాంతంలో వైరస్‌ ప్రబలే ప్రమాదమున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడింది.


పాత జాతీయ రహదారి పక్కన సీఎస్‌ఐ మైదానంలో వాహనాల అంగడికి వచ్చిన వారిలో 80శాతం మాస్కులు ధరించలేదు. ప్రతి వారం 100కు పైగా వాహనాలు క్రయవిక్రయాలు జరుగుతాయి. ఏ ఒక్కరూ కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోలేదు.


కామారెడ్డి ఆర్టీసీ బస్టాండులో నిత్యం 60వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థులతో పాటు, సాధారణ ప్రయాణికుల్లో 70 శాతం మంది మాస్కులు సక్రమంగా ధరించడం లేదు. ఉన్న వారు కూడా గదవ కింద పెట్టుకుంటున్నారు.


 

తిలక్‌రోడ్డులోని వివిధ వస్త్ర దుకాణాల్లో గురువారం ఒక్కరోజే 3 వేలకుపైగా జనాలు వచ్చినట్లు అంచనా. వందలాది మంది భౌతికదూరం విస్మరించి గుమిగూడారు.


న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

జిల్లాలో కొవిడ్‌ ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడంతో జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. కొవిడ్‌ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. నిబంధనలు పాటించకపోతే మూడో ముప్పు పొంచి ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాకేంద్రంలో గురువారం ఆయా ప్రాంతాల్లో ‘న్యూస్‌టుడే’ పరిశీలన చేయగా.. వందలో సగం మందికిపైగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మాస్కులు, శానిటైజర్లు వాడటం మానేశారు.

మళ్లీ జరిమానాలు..!

కొవిడ్‌ మొదటి, రెండో దశలో చాలామంది వైరస్‌ బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాటి చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. గతంలో మాస్కు ధరించని వారికి, నిబంధనలు పాటించని దుకాణ యజమానులకు భారీగా జరిమానాలు విధించారు. ప్రస్తుతం ప్రయాణ ప్రాంగణాలు, మార్కెట్లు, ప్రధాన చౌరస్తాలు, వాణిజ్య ప్రాంతాలు, బడులు, కళాశాలల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. వైరస్‌ ముప్పు పొంచి ఉందని పదేపదే చెబుతున్నా చాలామంది పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ తనిఖీలకు.. రూ.వెయ్యి జరిమానాలకు యంత్రాంగం సిద్ధమవుతోంది.

రెండో డోసు తీసుకుంది 27 శాతమే..

యథావిధిగా వ్యాపారాలు కొనసాగుతున్నాయి.. విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. శుభకార్యాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 27.01 శాతం మంది మాత్రమే కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్నారు. గడువు ముగిసినా ఆరోగ్యకేంద్రాలకు రావడం లేదు. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు.

టీకాకు ముందుకు రావాలి

కొవిడ్‌ టీకా మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు తప్పనిసరి. తీసుకోని వారు ఆరోగ్య కేంద్రాలకు రావాలి. ప్రతిఒక్కరు మాస్కు ధరిస్తూ.. భౌతికదూరం పాటించాలి. పండుగలు, శుభకార్యాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

- డా.శ్రీనివాస్‌, కొవిడ్‌ నోడల్‌ జిల్లా అధికారి, కామారెడ్డి జిల్లా

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని