logo
Published : 03/12/2021 03:18 IST

ముగిసిన పోడు దరఖాస్తుల స్వీకరణ

ఇక పరిశీలనే తరువాయి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు

పోడు భూములకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. గిరిజనులు, గిరిజనేతరులు హక్కుపత్రాల జారీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో అటవీ అధికారులు ఆశించిన దానికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల అటవీ అధికారులు గ్రామాల వారీగా విడుదల చేసిన ఆక్రమణదారుల ప్రాథమిక జాబితా తప్పుల తడకగా ఉండడంతో పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే గ్రామాల్లో పైరవీకారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

గడువుపై కొరవడిన స్పష్టత

ప్రభుత్వం మొదట పోడు రైతులకు హక్కుపత్రాల జారీ కోసం ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించినప్పటికీ నవంబరు నెలాఖరుతోనే గడువు ముగిసినట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఎఫ్‌ఆర్‌సీ(అటవీ హక్కుల కమిటీ) సభ్యులు మాత్రం ఇంకా ఉందంటున్నారు. జిల్లావ్యాప్తంగా కేవలం 25 వేల ఎకరాలు మాత్రమే ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం 50 వేల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు రావడంతో ప్రక్రియ ముగించారనే ఆరోపణలున్నాయి. జాప్యం చేసిన వారికి ప్రస్తుతం అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గత నెల 18 వరకే స్వీకరించారని అధికారులు చెబుతున్నారు.

మొదలైన ఆన్‌లైన్‌ ప్రక్రియ

అటవీ హక్కు పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఇప్పటికే 17 వేలకు పైగా అర్జీలను ఆన్‌లైన్‌ చేసినట్లు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.

క్షేత్రస్థాయిలో ఇలా

దరఖాస్తుల పరిశీలనను ఎఫ్‌ఆర్‌సీల ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి పరిశీలనలో వారితోపాటు రెవెన్యూ, అటవీ అధికారులుంటారు. ముఖ్యంగా పోడు ఏ సంవత్సరం నుంచి చేస్తున్నారో నిర్ధారించడం కోసం కార్టోశాట్‌(ఉపగ్రహ) చిత్రాలను వినియోగించనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

రాజకీయ జోక్యం నివారిస్తేనే

దరఖాస్తుల పరిష్కారంలో రాజకీయ జోక్యం నివారిస్తేనే పారదర్శకత లభిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అటవీ భూములున్న గ్రామాల్లో ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సభ్యులకు డిమాండు పెరిగింది. లింగంపేట, గాంధారి మండలాల్లోని గ్రామాల్లో బేరసారాలు ప్రారంభించినట్లు సమాచారం. భూముల విలువ పెరిగిన నేపథ్యంలో హక్కుపత్రాల కోసం ఎంతైనా వెచ్చించేందుకు ముందుకొస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని