logo
Published : 03/12/2021 03:18 IST

పనికో ధర.. దస్త్రానికో లెక్క

ఖజానాశాఖలో నిత్యకృత్యంగా వసూళ్లు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి;

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

ఉద్యోగుల జీతభత్యాలు మొదలుకొని వివిధ శాఖల పరిధిలో గుత్తేదారులకు చెల్లింపుల వరకు అన్నీ కోశాగార కార్యాలయాల నుంచి వెళ్లాల్సిందే. మధ్యవర్తులతో కలిసి కొందరు ట్రెజరీ సిబ్బంది భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఉద్యోగుల వేతన సవరణ బిల్లుల ఆమోదానికి పెద్దఎత్తున వసూలు చేసినట్లు విమర్శలొచ్చాయి. పారదర్శక లావాదేవీల నిర్వహణకు సాంకేతికతను వినియోగిస్తున్నా.. దందా ఆగడం లేదు.

* 2018- 21 మధ్య కాలంలో పదవీ విరమణ పొందిన వారికి రివైజ్డ్‌ పింఛన్‌ బకాయిలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గ్రాట్యుటీ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరి దస్త్రాలు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్లాలంటే ఒక్కొక్కరు రూ.1500- రూ.2000 వరకు ఇవ్వాలని కొందరు మధ్యవర్తులు విశ్రాంత ఉద్యోగులతో బేరసారాలకు దిగుతున్నారు.

2 వేల మంది వరకు

ఉద్యోగులకు 2018లో నూతన వేతన సవరణ ఒప్పందం అమలు చేయాల్సి ఉంది. ఆలస్యం కావడంతో వారు నష్టపోవద్దనే ఉద్దేశంతో 2018 జులై 1 తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రివైజ్డ్‌ పింఛన్‌ వర్తింపజేస్తోంది. వీరు అప్పటికే పొందిన గ్రాట్యుటీకి అదనంగా మరో రూ.4 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన జీవో గత నెలలో విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి 36 వాయిదాల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హుల్లో కొందరు తమ దస్త్రాలను ఏజీ కార్యాలయానికి పంపించారు. ఏజీ(అకౌంట్‌ జనరల్‌) కార్యాలయం నుంచి విశ్రాంత ఉద్యోగులకు రివైజ్డ్‌ పింఛన్‌కు సంబంధించిన దస్త్రాలు అందాయి. ఏజీ కార్యాలయం పంపించే మూడు జతల ఆర్డర్‌ కాపీల్లో ఒకటి ఖజానా కార్యాలయానికి, మరొకటి డ్రాయింగ్‌ అధికారికి, ఇంకోటి సదరు ఉద్యోగికి అందుతుంది. వారు బిల్లు చేయించుకొని ఎస్టీవోల్లో సమర్పించాలి. వీరు జిల్లా వ్యాప్తంగా 2 వేల మంది ఉన్నారు. ఇదే అదనుగా భావించి కొందరు ఎస్టీవోల పేరు చెప్పి ఒక్కొక్కరి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. దోమకొండ మండలంలో ఇప్పటికే ఎస్టీవో కార్యాలయంలో నిరంతరం లావాదేవీలు జరిపే ఓ మధ్యవర్తి విశ్రాంత ఉద్యోగులు నిర్దేశించిన నగదు ఇస్తేనే బిల్లు ఆమోదం పొందుతుందని, లేదంటే దరఖాస్తులు పక్కన పెడతారని హెచ్చరిస్తున్నారు. మిగతా మండలాల్లోనూ ఇదే దందా కొనసాగుతోంది.

ముందుకు కదలాలంటే..

ఎస్టీవో కార్యాలయాల సూచన మేరకు కొందరు మధ్యవర్తులు డబ్బులు అడుగుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రకంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు. గుత్తేదారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీరికి నిత్యం ట్రెజరీ కార్యాలయంలో పని ఉంటుండటంతో బహిరంగంగా చెప్పేందుకు వెనుకాడుతున్నారు. తమ పేర్లు బయటకు చెప్పొద్దంటూ కొందరు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు తాము ఏ బిల్లుకు ఎంత చెల్లించామనే వివరాలను ‘ఈనాడు’కు పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు.

మా దృష్టికి రాలేదు - సాయిబాబు, డీటీవో, కామారెడ్డి

ఎస్టీవో కార్యాలయాల్లో డబ్బులు అడుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. మధ్యవర్తులు ఎవరైనా వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయాలి. రెండ్రోజుల్లో ఎస్టీవోలతో సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చిస్తాను. మామూళ్లు ఎవరడిగినా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. విచారించి చట్టపరమైన చర్యలు చేపడతాం. ఆన్‌లైన్‌ కావడంతో పారదర్శకంగా బిల్లుల చెల్లింపు ఉంటుంది. అపోహలతో కొందరు విమర్శలు చేస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని