logo

నిధులిచ్చారు.. ఇందూరు మదిలో నిలిచారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతికి జిల్లాలో పలువురు సంతాపం ప్రకటించారు. ఏడాది పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు. మంత్రి హోదాలో పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చారు.

Published : 05 Dec 2021 05:33 IST

రోశయ్యకు జిల్లాతో విడదీయని అనుబంధం

2008లో కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోశయ్యతో అప్పటి సభాపతి సురేశ్‌రెడ్డి,

వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి, తాహెర్‌ బిన్‌ హందాన్‌

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతికి జిల్లాలో పలువురు సంతాపం ప్రకటించారు. ఏడాది పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు. మంత్రి హోదాలో పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చారు. 2008లో కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధన కేంద్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేసి ఆయనే స్వయంగా శంకుస్థాపన చేశారు.

* తెలంగాణ విశ్వవిద్యాలయం ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే మంజూరైంది. అప్పటి నాయకుల వినతుల మేరకు వర్సిటీ సకాలంలో పూర్తయ్యేలా నిధులు విడుదల చేశారు.

* నిజామాబాద్‌లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారితో ఆయనకు సత్సంబంధాలున్నాయి. పలుమార్లు ఆయన శుభకార్యాలు, వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆర్యవైశ్య పాఠశాల ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు.

* జుక్కల్‌, బాన్సువాడ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వచ్చారు.

కాంగ్రెస్‌కు తీరని లోటు

ఆయన మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని డీసీసీ అధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, అర్బన్‌ ఇన్‌ఛార్జి తాహెర్‌ బిన్‌, నగర అధ్యక్షుడు కేశ వేణు, రూరల్‌ ఇన్‌ఛార్జి భూపతి రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని తెలిపారు.

డీఎస్‌ సంతాపం

నిజామాబాద్‌ నగరం: మాజీ సీఎం రోశయ్య మృతికి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి మంత్రిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఒక మంచి నాయకుణ్ని కోల్పోయినట్లు పేర్కొన్నారు.

 


అనుబంధం మరువలేనిది

- సుదర్శన్‌ రెడ్డి, మాజీ మంత్రి

వైఎస్‌ హయాంలో ఇద్దరం సహచర మంత్రులం. వైఎస్‌ మరణాంతరం రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశాను. నిబద్ధత కలిగిన వ్యక్తి. రాజకీయాలకతీతంగా అభివృద్ధి కోసం పనిచేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరు ఓ గొప్ప నేతను కోల్పోయారు.


సామాన్యుడిగానే ఉన్నారు

- మహేష్‌ కుమార్‌ గౌడ్‌, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

రోశయ్యతో నాకు చాలా దగ్గరి సంబంధాలున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. నిత్యం మేము కలిసి రాజకీయ అంశాలపై చర్చించేవాళ్లం. కలిసి భోజనాలు చేసేవాళ్లం. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా.. సామాన్య వ్యక్తిగానే ఉన్నారు. గొప్ప విలువలు కలిగిన నేతను కోల్పోవడం బాధగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని