logo
Published : 05/12/2021 05:33 IST

స్వచ్ఛ లక్ష్యం.. మరెంతో దూరం

పట్టణాల్లో గాడిన పడని పారిశుద్ధ్య నిర్వహణ
సమస్యల వలయంలో శివారు కాలనీలు

నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడిన పడలేదు. ప్రధాన రోడ్లకే పరిమితమవుతూ శివారు, అంతర్గత కాలనీలను పట్టించుకోవట్లేదు. అక్కడి నివాసాల మధ్య చెత్త కుప్పలు, ముళ్ల పొదలు, మురుగు గుంతలు ఏర్పడి దుర్వాసన వెలువడుతోంది. పారిశుద్ధ్య ఫిర్యాదుల ఆధారంగా ‘న్యూస్‌టుడే’ శనివారం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు చేసిన పరిశీలనలో ఈ విషయాలు వెలుగుచూశాయి.


ఒకరి భారం మరొకరిపై..

బోధన్‌ బసవతారకనగర్‌ కాలనీలో పేరుకున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

బోధన్‌ పట్టణం : నలుగురు చేయాల్సిన పనికి ఇద్దరే హాజరవుతున్నారు. ఒక్కో కార్మికుడు రోజుకు 500-750 మీటర్లు ఊడవాలని, కాలువ పరిమాణం ఆధారంగా 80-160 మీటర్లు శుభ్రం చేయాలని నిబంధనలు చెబితే 50-70 శాతం అదనపు భారం పడుతోందంటున్నారు. బోధన్‌ పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థలో కార్మికులు తరుచూ గైర్హాజరవుతున్నారు. అదనంగా కార్మికులను నియమించినా పెరిగిన పట్టణ పరిధి, కాలనీలతో పారిశుద్ధ్య సేవలకు విఘాతం ఏర్పడుతోంది.

* 38 వార్డులను 9 జోన్లుగా విభజించి 137 మంది కార్మికులను కేటాయించారు. శనివారం 16 మంది గైర్హాజరయ్యారు. రోజూ ఈ సంఖ్య 25 వరకు ఉంటుంది. కేటాయించిన కార్మికుల్లో 9 ట్రాక్టర్లకు 27 మంది, ట్రక్కులకు 24 మందిని నియమిస్తారు. ఎక్కువ మందిని చెత్త సేకరణ పనుల కోసం వినియోగించగా కాలువల్లో పూడిక తొలగించడానికి ఇద్దరు లేదా ముగ్గురు మిగులుతున్నారు. ఇక్కడ హాజరు నమోదుపై ప్రత్యేక విధానం పాటిస్తున్నారు. రిజిస్టర్‌లో వేసిన హాజరుకు సంబంధించిన చిత్రాన్ని జవాన్ల గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు.


నిలిచిన మురుగు

నందిగల్లీలో..

భీమ్‌గల్‌ : భీమ్‌గల్‌ పట్టణంలోని కుప్కల్‌రోడ్డు, నందీశ్వర కాలనీ, వేల్పూర్‌ రోడ్డులోని కాలనీలు మురుగు నిలయాలుగా మారాయి. ఏడు వాహనాల ద్వారా చెత్త సేకరించారు. కాలనీల వారీగా బృందాలుగా విడిపోయి చెత్త ఊడ్చే పనిలో నిమగ్నమయ్యారు. పలుచోట్ల పోగు చేసిన చెత్తను తరలించక అలాగే వదిలేశారు. నందిగల్లీలో కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది.


సమయవేళలు పాటించరు..


నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో చెత్త కుప్ప

నిజామాబాద్‌ నగరం : నగర పాలక సంస్థ శివారు కాలనీల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగట్లేదు. ప్రధాన రహదారులు మినహాయిస్తే రోటరీనగర్‌, సాయినగర్‌, ఆనంద్‌నగర్‌, దుబ్బ, ముజాయిద్‌నగర్‌, గౌతంనగర్‌, ఇందిరప్రియదర్శిని కాలనీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించట్లేదు. కొత్త కలెక్టరేట్‌ సమీపంలోని దుబ్బలో రోడ్డు పక్కన చెత్త వేస్తున్నారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. అరుంధతినగర్‌, గిరిరాజ్‌ కళాశాల, నీల కంఠేశ్వర్‌ నగర్‌, మారుతినగర్‌లో వాహనం సమయానికి రాలేదు.

* ఉదయం 7.30కు దుబ్బ ప్రాంతంలోని ఓ మహిళా చెత్తబుట్ట తీసుకొని రోడ్డుపైకి వచ్చింది. మున్సిపల్‌ వాహనం వస్తే అందులో వేయవచ్చు కదా అని ప్రశ్నించగా.. ఎప్పుడో ఒకసారి పది దాటిన తర్వాత వస్తుందని సమాధానం ఇచ్చారు. ఉదయం రావాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదన్నారు.

* ఉదయం 7.40కు గౌతంనగర్‌లో రోడ్డుపై చెత్త పేరుకపోయింది. సిబ్బంది సమయ వేళలు పాటించడం పాటించట్లేదని స్థానికులు తెలిపారు. ● దుబ్బ, చంద్రశేఖర్‌ కాలనీ(లోపల), వర్ని రోడ్డు, సీతారాంనగర్‌ కాలనీలోని మురుగు కాల్వల్లో చెత్తతో నిండిపోయాయి. ఆయా చోట్ల పది రోజులకోసారి కాల్వలు శుభ్రం చేస్తారని స్థానికులు తెలిపారు. కంఠేశ్వర్‌, చంద్రశేఖర్‌ కాలనీ చౌరస్తా, గౌతంనగర్‌, పులాంగ్‌, వినాయక్‌నగర్‌లో కాల్వలు శుభ్రం చేశారు. అంతర్గత కాలనీలు శుభ్రం చేయలేరు.


ప్రధాన రోడ్ల వరకే..


పెర్కిట్‌ కూరగాయల మార్కెట్‌ ఆవరణను శుభ్రం చేస్తున్న సిబ్బంది

ఆర్మూర్‌ గ్రామీణం : ఆర్మూర్‌ పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాలు, ప్రధాన రోడ్ల వెంట పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో సరిగా లేదు. పెర్కిట్‌, కొటార్మూర్‌, మామిడిపల్లిలోని కాలనీల్లో పక్కా మురుగు కాల్వలు నిర్మించలేదు. అన్నపూర్ణ కాలనీ, తిరుమల, శ్రీరామ, శ్రీనివాస, విద్యానగర్‌ కాలనీల్లో మురుగు కాల్వలు చెత్తతో పేరుకుపోయాయి. పెర్కిట్‌ పెద్ద చెరువులో మురుగు నీరు చేరుతుంది. మామిడిపల్లిలోని ఆదర్శ్‌నగర్‌, సరస్వతీనగర్‌, వెంకటేశ్వర, యోగేశ్వర కాలనీ, పాత మామిడిపల్లిలో మురుగు పారట్లేదు. మరో 17 మినీ ట్రాలీల అవసరం ఉంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని