సంఘటితమవుతుండ్రు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్: అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రామ్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 90,569 మంది, నిజామాబాద్ జిల్లాలో 31,912 మంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సౌకర్యం లేకుండా వివిధ రంగాల్లో పని చేస్తున్న 18- 59 ఏళ్ల వారంతా నమోదుకు అర్హులు. జిల్లావ్యాప్తంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మొదట నవంబరు వరకే నమోదు గడువు ఉండగా.. డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించారు.
ఏడాదిపాటు బీమా
ఈ-శ్రామ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుంటే ప్రత్యేక గుర్తింపు కార్డు(యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్) కేటాయిస్తారు. ప్రతి కార్మికుడికి ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద బీమా, అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష బీమా వర్తింపజేస్తారు. ఆర్థిక సాయం నేరుగా జమ చేస్తారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ
కామారెడ్డి జిల్లాలో ఈ-శ్రామ్ పథకం కింద ప్రతి కార్మికుడిని చేర్పించేలా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న అసంఘటిత కార్మికులను గుర్తించేందుకు కృషి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లలో కామారెడ్డి కంటే చాలా వెనుకబడి ఉంది.
వీరు అర్హులు..
ఈ-శ్రామ్ పథకానికి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ అర్హులే. చేనేత, ఇటుక బట్టీలు, క్వారీలు, వడ్రంగులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, వలసదారులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు, వీధి వ్యాపారులు, రిక్షావాలాలు, మత్స్యకారులు, ప్రైవేటు వాహన డ్రైవర్లు, కల్లుగీత, బీడీ, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు నమోదు చేసుకోవచ్ఛు వీరిలో ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ పొందుతున్న వారు, ప్రభుత్వానికి పన్ను చెల్లించే వారు అనర్హులు
నెలాఖరు నాటికి మరిన్ని పెంచుతాం - సురేంద్రకుమార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, కామారెడ్డి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-శ్రామ్ పథకంలో అర్హులైన ప్రతి కార్మికుడిని చేర్పించడానికి కృషి చేస్తున్నాం. ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించినందున మరింత మంది రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూస్తాం. చరవాణిలో స్వీయంగానే నమోదు చేసుకోవచ్ఛు
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.