logo

నిరుద్యోగులకు ఉపాధి నైపుణ్యం

కేంద్ర ప్రభుత్వం దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా చదువు మధ్యలో మానేసిన నిరుద్యోగ యువతకు మూడు నెలల పాటు ఉచితంగా

Published : 09 Dec 2021 03:15 IST

కామారెడ్డి, డిచ్‌పల్లి కేంద్రాల్లో శిక్షణ
న్యూస్‌టుడే, కామారెడ్డి సంక్షేమం

గతేడాది శిక్షణ తరగతులకు హాజరైన యువతులు

కేంద్ర ప్రభుత్వం దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా చదువు మధ్యలో మానేసిన నిరుద్యోగ యువతకు మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు స్థిరమైన జీవనోపాధి కల్పించడానికి డీఆర్‌డీఏ అనుసంధానంగా ఎంప్లాయీమెంట్‌ జనరేషన్‌, మార్కెంటింగ్‌ మిషన్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఇది జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేస్తోంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలకు, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో మహిళలు, పురుషులకు మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఈ నెల 15 నుంచి తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉన్నతి కుటుంబాలకు ప్రాధాన్యం
ఉపాధిహామీ పథకంలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న ఉన్నతి కుటుంబాలకు డీడీయూలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీరు తదుపరిగా ఉపాధి పనికి వెళ్లడానికి వీలుండదు కాబట్టి ఇందులో ఎంపిక చేస్తామని అధికారులు పేర్కొంటు
న్నారు. వీరికి శిక్షణ సమయంలో నిత్యం రూ.235 చొప్పున చెల్లించనున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వంద రోజుల పనిదినాలు పూర్తయిన 26 మంది అభ్యర్థుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.

అర్హతలు.. ధ్రువీకరణ పత్రాలు
పదో తరగతి పూర్తి లేదా మధ్యలో మానేసిన వారు అర్హులు. పదో తరగతి మెమో, ఆధార్‌, రేషన్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, నాలుగు ఫొటోలు జత చేసి దరఖాస్తులు సమర్పించాలి.

ఏయే అంశాల్లో..
ఈ సంస్థ ద్వారా 50 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఆంగ్లం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు. ఒక్కో కోర్సులో 35 సీట్లు ఉంటాయి. మూడు నెలల శిక్షణ తర్వాత ప్రైవేటు రంగంలో మూడు నెలలు కచ్చితంగా ఉద్యోగం చేయాలనే నిబంధనతో సీటు కేటాయిస్తారు. కనీసం రూ.9 వేల- 12 వేల వేతనం ఇప్పిస్తారు. అయితే ఒక్కో జిల్లాలో ఒక్కో అంశంలో శిక్షణ ఉంటుంది. అభ్యర్థి ఎంపికను బట్టి ఆయా జిల్లాలకు పంపిస్తారు.

ఇక్కడి కోర్సులు
ఈ.డబ్ల్యూ, ఆర్‌, సీ(ఇంగ్లీష్‌ వర్క్‌ రెడీనెస్‌ అండ్‌ కంప్యూటర్స్‌)లో భాగంగా కామారెడ్డిలో 35 మంది మహిళలకు, డిచ్‌పల్లిలో 35 మంది పురుషులకు శిక్షణ ఇస్తారు. మహిళలకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో కుట్టు, ఎంబ్రాయిడరీ, జూట్‌ బ్యాగ్‌ తయారీ నేర్పిస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి
- రవీందర్‌రావు, డీపీఎం

నిరుద్యోగ యువత డీడీయూ పథకం ద్వారా శిక్షణ పొంది స్థిరమైన జీవనోపాధి పొందాలి. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు ఏ జిల్లాలో ఉంటే అక్కడే సీటు కేటాయిస్తాం. ఒక వేళ బ్యాచ్‌లో 35 సీట్లు నిండితే మూడు నెలల వరకు ఆగాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని