logo

TS News: ఎంపీ అర్వింద్‌ను అడ్డుకునేందుకు తెరాస యత్నం.. గన్నారంలో ఉద్రిక్తత

నిజామాబాద్‌జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామంలో నిజామాబాద్‌ ఎంపీ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి..

Updated : 26 Dec 2021 19:30 IST

ఇందల్వావాయి: నిజామాబాద్‌జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామంలో నిజామాబాద్‌ ఎంపీ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీని తెరాస శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. ఎంపీ రాకకు గంట ముందు నుంచే తెరాస కార్యకర్తలు గన్నారం ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, యాసంగిలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలకు రావడమేంటని ప్రశ్నించారు. ఎంపీ కాన్వాయ్‌ రాగానే తెరాస శ్రేణులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈక్రమంలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు ఎంపీ కాన్వాయ్‌ను ముందుకు పంపడంతో గొడవ సద్దుమణిగింది.

రాజకీయాలకు ఇంకా సమయం ఉంది: ఎంపీ అర్వింద్‌

గన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ అర్విద్‌ మాట్లాడుతూ.. తనను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు.  ప్రజాశ్రేయస్సు కోసం జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో 60శాతం నిధులు కేంద్రానివేనని తెలిపారు. ¸కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రం కోడిగుడ్డు కూడా కొనలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసని, రాజకీయాలకు ఇంకా సమయం ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని