logo

230 ఎకరాల్లో పంట నష్టం

అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన జోరువానకు జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 230 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా తేల్చింది. ఇందులో ఎక్కువగా

Published : 15 Jan 2022 03:16 IST

ధర్పల్లి మండలం మైలారంలో వర్షానికి నేలవాలిన మొక్కజొన్నను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు, రైతులు

ఈనాడు, నిజామాబాద్‌: అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన జోరువానకు జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 230 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా తేల్చింది. ఇందులో ఎక్కువగా మొక్కజొన్న ఉంది. ఏపుగా ఎదిగి.. పూత దశలో ఉన్న పంట గాలుల కారణంగా నేలకొరిగింది. ధర్పల్లి, సిరికొండ, ఇందల్‌వాయి మండలాల్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం 196 మంది అన్నదాతలపై ప్రభావం పడినట్లుగా చూపారు. కానీ 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న చోటే పంట నష్టాన్ని అధికారికంగా పరిగణనలోకి తీసుకుంటారు. కొంతమేర దెబ్బతిన్న పొలాలను కూడా లెక్కల్లోకి తీసుకుంటే నష్టం అంచనా మరింతగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కొన్ని చోట్ల ఉల్లి, ఆవాల పంటలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇటీవల వేసిన పొద్దుతిరుగుడు పంటకు నష్టం వాటిల్లినట్లుగా రైతులు చెబుతున్నారు.

పరిహారం అందని ద్రాక్షే.. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపడమే తప్ప, నాలుగేళ్లుగా పరిహారం అందట్లేదు. రాష్ట్రంలో పంటల బీమా పథకం ఐచ్ఛికం చేశారు. రైతులు నేరుగా బీమా కంపెనీలకు ప్రీమియాలు చెల్లించే పథకాలపై వారు ఆసక్తి చూపించట్లేదు. కేంద్ర, రాష్ట్ర వాటాలుగా ప్రీమియం చెల్లించి పరిహారం అందించే విధానం అమలైతే తప్ప కర్షకులకు ప్రయోజనం చేకూరదు.


ఐదెకరాల్లో దెబ్బతింది..
- వెంకటరెడ్డి, గన్నారం, ఇందల్‌వాయి

గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఐదెకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. పూత దశలో నష్టం జరిగింది. విత్తనాల్లో కూడా తేడాలున్నట్లు అనుమానాలు ఉన్నాయి. వ్యవసాయాధికారులు పరిశీలించి సమస్య ఏంటో గుర్తించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని