logo

తుపాకీతో బెదిరించిన ముగ్గురి అరెస్టు

చిన్నపాటి గొడవకే తుపాకీతో బెదిరించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో పొందుర్తి చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దేవునిపల్లి పోలీసుస్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల

Published : 18 Jan 2022 03:31 IST

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే : చిన్నపాటి గొడవకే తుపాకీతో బెదిరించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో పొందుర్తి చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దేవునిపల్లి పోలీసుస్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ అన్యోన్య వివరాలు వెల్లడించారు. పొందుర్తి చౌరస్తా వద్ద ఓ దాబాలో భోజనం చేసేందుకు టేక్రియాల్‌కు చెందిన పోతారం సంతోష్‌ స్నేహితులతో కలిసి వెళ్లారు. తినేసి బయటకు వస్తుండగా చాట్ల జనార్దన్‌ అనే వ్యక్తి వారి కారుపై మూత్రం పోస్తూ కనిపించాడు. అందరూ కలిసి నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలోనే అక్కడికి వచ్చిన జనార్దన్‌ స్నేహితులు మహ్మద్‌ సాజిద్‌, భోగి రవీందర్‌ అతనికి మద్దతుగా నిలిచి దుర్భాషలాడారు. మహ్మద్‌ సాజిద్‌ తన వద్ద ఉన్న పిస్టల్‌ తీసి గురిపెట్టి ‘ఏమనుకుంటున్నార్రా చంపేస్తానంటూ’ భయపెట్టాడు. వారి నుంచి బయటపడ్డ సంతోష్‌ బృందం అటుగా వెళ్తున్న పెట్రోలింగ్‌ పోలీసులకు విషయం చెప్పగా అక్కడికి చేరుకున్నారు. సాజిద్‌ వద్ద ఉన్న పిస్టల్‌తోపాటు ఏడు రౌండ్ల తూటాలు, మూడు చరవాణులు, కారును స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి శివారు ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ సాజిద్‌, విద్యానగర్‌కాలనీలో నివాసముండే చాట్ల జనార్దన్‌, దేవునిపల్లికి చెందిన భోగి రవీందర్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు. సాజిద్‌ పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. అతనిపై రౌడీషీట్‌ కూడా ఉందన్నారు. గతేడాది సెప్టెంబరు 20న తహసీల్దారు ముందు బైండోవర్‌ చేశామన్నారు. స్థిరాస్తి వ్యాపారం చేసే ఇతనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలిపారు.  సమావేశంలో కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి ఎస్సై ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని