logo

రెట్టింపవుతున్న పాజిటివ్‌లు

జిల్లాలో కొవిడ్‌ విజృంభిస్తోంది. రోజు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ బాధితులు పెరుగుతున్నారు. మూడో దశలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు స్పష్టం

Published : 18 Jan 2022 03:31 IST

మంగళవారం 318 మందికి వైరస్‌

న్యూస్‌టుడే: నిజామాబాద్‌ వైద్యవిభాగం : జిల్లాలో కొవిడ్‌ విజృంభిస్తోంది. రోజు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ బాధితులు పెరుగుతున్నారు. మూడో దశలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు స్పష్టం చేస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి తోడు స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఐసోలేషన్‌లో ఉండకుండా ఏదో ఒక అవసరాల నిమిత్తం బయటకు వస్తుండటం తీవ్రతను పెంచుతోంది.

పది రోజుల్లో 1216 కేసులు..
జిల్లాలో గత పది రోజుల్లో 6841 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 1216 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. కొన్ని యూపీహెచ్‌సీల్లో 20 మందిని పరీక్షిస్తే పది మందికి వైరస్‌ ఉన్నట్లు గుర్తిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.

బయట తిరిగేస్తున్నారు
బాధితుల్లో చాలా వరకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా భావించి కొందరు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు.
ఓ దుకాణంలో పనిచేసే వ్యక్తికి పాజిటివ్‌ అని తేలినా కుటుంబ పోషణ నిమిత్తం పనిలోకి వెళ్తున్నాడు. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా పాజిటివ్‌ వచ్చినవారు బయటకు రాకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఓ వైపు రెండింతల వేగంతో వైరస్‌ వ్యాపిస్తుంటే మరోవైపు ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు అమలు కావట్లేదు. రెండో దశలో దుకాణాల ఎదుట భౌతిక దూరం పాటించేలా డబ్బాలు గీశారు. ప్రయాణ ప్రాంగణాల్లో ఒక సీటు వదిలి మరొకరు కూర్చునేలా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అలాంటివి కనిపించట్లేదు. మాస్కుల్లేకుండానే బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు.

మాత్రలు కొంటున్నారు
అనేక మంది ఔషధ దుకాణాల్లోకి వెళ్లి జ్వరం, జలుబు, గొంతునొప్పి మాత్రలు కొని వేసుకుంటున్నారు. కరోనా లక్షణాలు కనిపించినా పరీక్షలకు ముందుకు రావట్లేదు. ఇది సరైన పద్ధతి కాదంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

5,946 మందికి టీకా
నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సోమవారం 5,946 మందికి టీకాలు వేశారు. వీరిలో టీనేజర్లు 445, 18 నుంచి 60 ఏళ్లవారు 5,501 మంది ఉన్నారు.


ప్రజలు సహకరించాలి
- డాక్టర్‌ సుదర్శనం, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి

ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. కొవిడ్‌ నిబంధనలు పాటించడం తమ బాధ్యతగా భావించాలి. వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సహకరించాలి. అప్పుడే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలం. పాజిటివ్‌ వచ్చిన వారు బయట తిరగొద్దు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని