logo

పేదల భూములు పెద్దలపాలు

నిరుపేదలు సాగు చేసుకొని జీవనోపాధి పొందాలని ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు క్రమంగా చేతులు మారాయి. ఇటీవల జిల్లాల వారీగా ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వేలో వీటిని గుర్తించారు. ఉభయ జిల్లాల్లోని అసైన్డు

Published : 18 Jan 2022 03:31 IST

సగానికిపైగా అన్యాక్రాంతం
వివరాలు సిద్ధం చేసిన యంత్రాంగం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి : నిరుపేదలు సాగు చేసుకొని జీవనోపాధి పొందాలని ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు క్రమంగా చేతులు మారాయి. ఇటీవల జిల్లాల వారీగా ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వేలో వీటిని గుర్తించారు. ఉభయ జిల్లాల్లోని అసైన్డు భూముల్లో 40శాతం అన్యాక్రాంతమైనట్లు నిర్ధారించారు. కొన్నింటికి ఏకంగా పట్టాలు సృష్టించి అమ్మేసినట్లు తేలింది. నిందితులపై భూ బదలాయింపు నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది. భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలోనే లెక్కలు తీసినా యంత్రాంగం మిన్నుకుండిపోయింది. ప్రస్తుతం ఏ మేరకు స్పందిస్తారో తేలాల్సి ఉంది.

అధిక శాతం వారి చేతుల్లోనే..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధిక శాతం ప్రభుత్వ భూములను బడాబాబులు హస్తగతం చేసుకున్నారు. నిబంధనల మేరకు అసైన్డు భూముల క్రయవిక్రయాలు నిషేధం. ఇందుకు విరుద్ధంగా నిరుపేదల అవసరాలను అనుకూలంగా మార్చుకున్న తక్కువ ధరకు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల శివారు గ్రామాల్లోనూ మెజారిటీ అసైన్డు భూములు చేతులు మారిపోయాయి. సాగుయోగ్యమైన వాటిని ప్లాట్లుగా మారుస్తున్నారు.

బహిర్గతం కానివి మరెన్నో
కొన్నేళ్లుగా ఆయా ప్రభుత్వాలు దాదాపు అయిదు లక్షల ఎకరాలను పేదలకు పంచాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా రెవెన్యూ అధికారుల లెక్కల్లో 2,32,543 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. అంటే మూడు లక్షల ఎకరాలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ జిల్లాల్లో అసైన్డు చేసిన ప్రభుత్వ భూముల్లో అధిక శాతం సాగుకు యోగ్యమైనవే కావడం గమనార్హం. పట్టణాలకు సమీప గ్రామాల్లో ఇచ్చిన వాటిని చాలావరకు  సాగు చేయడం లేదు. చేతులు మారడంతో నిర్మాణాలు వెలిశాయి.  

చర్యలు ప్రశ్నార్థకమే
భూదస్త్రాల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ అధికారులు మొదటిసారిగా అసైన్డు భూముల లెక్కలు తీశారు. ఇటీవల భూ బ్యాంకు ఏర్పాటు నిమిత్తం రెండోసారి వివరాలు సేకరించారు. ఈసారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని