logo

ట్రాకర్‌ లేని ట్రాక్టర్‌

పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్‌ పరికరాలు అమర్చే ప్రక్రియ ఏడాదిగా జాప్యమవుతూనే ఉంది. ఇతర జిల్లాల్లో ఈ విధానం ఇప్పటికే అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సర్పంచులు సొంత పనులకు వాడుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డీజిల్‌

Published : 18 Jan 2022 03:31 IST

పంచాయతీ వాహనం సర్పంచుల సొంత పనులకు 

జీపీఎస్‌ అనుసంధానించడంలో జాప్యం

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

ట్యాంకరుతో మొక్కలకు నీరు పడుతూ..

పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్‌ పరికరాలు అమర్చే ప్రక్రియ ఏడాదిగా జాప్యమవుతూనే ఉంది. ఇతర జిల్లాల్లో ఈ విధానం ఇప్పటికే అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సర్పంచులు సొంత పనులకు వాడుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డీజిల్‌ బిల్లులు పంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తూ వ్యవసాయ, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ అక్రమాలకు చెక్‌ పెట్టడానికి జీపీఎస్‌ ట్రాకర్‌ పరికరాలు అమర్చాలని అధికారులు గతేడాది నిర్ణయించారు.

పల్లెపల్లెకు  కొనుగోలు
ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టరు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. జిల్లాలో 526 పంచాయతీలు రుణం తీసుకుని కొనుగోలు చేశాయి. ట్రాలీ, ట్యాంకర్లు అదనం. పల్లెప్రగతి కార్యక్రమంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు వీటిని వినియోగించుకోవాలని సూచించింది. తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు షెడ్లకు తరలించాలని పేర్కొంది. హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకరు సాయంతో నీరుపోసి ఉపాధిహామీ డబ్బులతో కిస్తులు చెల్లించుకోవాలని చెప్పారు. ఇదే అదనుగా భావించిన కొందరు సర్పంచులు సొంత పనులకు వాడుకుంటున్నారు. సొంతానికి వినియోగిస్తున్న వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

విచారించి వదిలేశారు..
వీటిని సొంత పనులకు వాడుతున్నారని గతేడాది గ్రామస్థుల ద్వారా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫొటోలు కూడా పంపడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 18 మంది సర్పంచులు దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. వారికి తాఖీదులు జారీ చేసి వివరణ కోరాలని నిర్ణయించారు. కానీ ఇంత వరకు అతీగతీ లేదు.

అక్రమాలకు తెర..
జీపీఎస్‌ అమర్చితే పారదర్శకత పెరుగుతుంది. ఇంధనం కోసం ఎన్ని డబ్బులు వెచ్చిస్తున్నారో గ్రామ పౌరులకు తెలుస్తుంది. చెత్త సేకరణ కోసం ఎన్ని కిలోమీటర్లు తిరిగింది.. మొక్కలకు నీరు పోయడానికి ఎంత దూరం వెళ్లింది వంటి వివరాలు కనిపిస్తాయి. పట్టణాలు, సర్పంచుల వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్తే  తెలిసిపోతుంది. జీపీఎస్‌ ట్రాకర్‌ పొందుపరిచిన డేటా మూడు నెలల వరకు అందుబాటులో ఉంటుంది. గ్రామసభలో ప్రజలు నిలదీసే అవకాశం ఉంటుంది.


త్వరలోనే ఏర్పాటు చేయిస్తాం
- ప్రభాకర్‌, జిల్లా పంచాయతీ అధికారి, కామారెడ్డి

పంచాయతీ ట్రాక్టర్లకు  జీపీఎస్‌ పరికరాలను త్వరలోనే ఏర్పాటు చేయిస్తాం. టెండర్‌ ప్రక్రియ పూర్తికాగానే జిల్లావ్యాప్తంగా అమర్చుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని