logo

ఇందూరుపై డేగ కన్ను

ఏ చిన్న ప్రమాదం జరిగినా.. దొంగలు అలజడి సృష్టించినా.. నేర ఘటన నమోదైనా.. గొడవ జరిగినా.. సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా మారాయి.. వీటి ఆధారంగానే కేసుల దర్యాప్తు అత్యంత వేగంగా, సులువుగా జరుగుతోంది. అందుకే నేరాల

Published : 20 Jan 2022 02:40 IST

 కమాండ్‌ కంట్రోల్‌తో 24 గంటల పర్యవేక్షణ
 అధునాతన సాంకేతికత వినియోగం

ఏ చిన్న ప్రమాదం జరిగినా.. దొంగలు అలజడి సృష్టించినా.. నేర ఘటన నమోదైనా.. గొడవ జరిగినా.. సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా మారాయి.. వీటి ఆధారంగానే కేసుల దర్యాప్తు అత్యంత వేగంగా, సులువుగా జరుగుతోంది. అందుకే నేరాల నియంత్రణలో పోలీసులు ‘నిఘా’కు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. కమిషనరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఏకకాలంలో 135 కెమెరాలు పర్యవేక్షిస్తుంటారు.

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

‘‘ఇటీవల బస్టాండు సమీపంలో ఓ వాహనం అపహరణకు గురైంది. ఆ ప్రాంతంలో ప్రైవేటు సీసీ కెమెరాలు ఏమీ లేవు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కమాండ్‌ కంట్రోల్‌ రూంలో పరిశీలించారు. ఓ కూడలి వద్ద నిందితుడు వాహనాన్ని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు పోలీసులకు చిక్కాయి. చివరకు అతన్ని గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.’’
* ‘‘బోధన్‌ రోడ్డులో తాజాగా ఓ బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై నిజానిజాలు తెలుసుకొనేందుకు పోలీసులు విచారణ చేపట్టగా స్పష్టత రాలేదు. చివరకు అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉండటంతో సత్వరమే కమాండ్‌ కంట్రోల్‌కు వెళ్లి పరిశీలించారు. ప్రమాద ఘటన మొత్తం అందులో రికార్డు కావడంతో ఈ కేసు దర్యాప్తు వారికి సులువుగా మారింది.’’

కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూం పనితీరును పరిశీలిస్తున్న
సీపీ నాగరాజు, డీసీపీ అరవింద్‌ బాబు, ఏసీపీ ప్రభాకర్‌ రావు

135  కెమెరాలు

* నిజామాబాద్‌ నగరంలో 15 ప్రధాన కూడళ్లు ఉన్నాయి. అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేవలం కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలే 80 వరకు ఉన్నాయి.
* సమస్యాత్మక ప్రాంతాలు, జనసమ్మర్ద ప్రదేశాల్లో మరో 55 కెమెరాలు బిగించారు. వీటన్నింటిని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించారు.
* తాజాగా ఐదు కూడళ్లలో ఆటోమెటిక్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.
* ప్రస్తుతం కమిషనరేట్‌ కంట్రోల్‌ రూం నుంచి 10 కి.మీ. పరిధిలో ఉన్న కెమెరాలన్నీ అనుసంధానమయ్యాయి. త్వరలోనే మిగితా కెమెరాలను వీటికి అనుసంధానించనున్నారు.
కేసుల  దర్యాప్తులో ఇలా..
కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు ద్వారా కేసుల దర్యాప్తు అత్యంత సులువుగా మారిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2020లో 350 కేసుల్లో కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా లభించిన ఆధారాలు కేసుల దర్యాప్తునకు కీలకంగా మారాయి. 2021లో దాదాపు 400 కేసుల్లో ఆధారాలను ఈ సీసీ ఫుటేజీల ద్వారా సేకరించారు. సాంకేతికపరమైన ఆధారాలు కావడంతో కోర్టుల్లో కేసులు సత్వరమే పరిష్కారమై నిందితులకు సకాలంలో శిక్షలు అమలవుతున్నాయి. ఫలితంగా రెండేళ్లుగా కమిషనరేట్‌లో ఐపీసీ కేసుల శిక్షల రేటు పెరుగుతూ వస్తోంది.
దొంగతనాలు, నేరాలు తగ్గుముఖం
- కె.ఆర్‌.నాగరాజు, సీపీ

రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నిఘాకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. పోలీసు శాఖపరంగా అవసరమైన ప్రతిచోట కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అధునాతన సాంకేతికత ఉన్న కెమెరాలను అందుబాటులోకి తెస్తున్నాం. వీటన్నింటిని అనునిత్యం కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు సైతం తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద విధిగా సీసీ కెమెరాలు బిగించుకోవాలి. గ్రామాలు, కాలనీలు యూనిట్‌గా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకొనేలా చూడాలని అధికారులకు సూచనలు చేశాం. నిఘా పక్కాగా ఉంటే దొంగతనాలు, నేరాలు తగ్గుముఖం పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని