logo

వర్గపోరు.. వీడియోల జోరు

అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. మాక్లూర్‌ మండలంలో వివాదాలే ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. సొంత పార్టీలో కొనసాగుతున్న సర్పంచుల భర్తలు ఎమ్మెల్యేపై విమర్శలకు దిగుతున్నారు. వీడియోలు

Published : 20 Jan 2022 02:40 IST

ఈనాడు, నిజామాబాద్‌ : అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. మాక్లూర్‌ మండలంలో వివాదాలే ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. సొంత పార్టీలో కొనసాగుతున్న సర్పంచుల భర్తలు ఎమ్మెల్యేపై విమర్శలకు దిగుతున్నారు. వీడియోలు తీసి మరీ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. తాము చేసే వ్యాపారాలు, పంచాయతీల్లో చేసిన పనులపై విచారణలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దేనికీ భయపడమని..రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని సవాళ్లు విసురుతున్నారు. ఇది ఆరంభమే..ఇంతటితో ఆగదంటూ..ఒక్కో వీడియో బయటకొస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలే ఈ పరిణామాలకు కారణమని కార్యకర్తలు బహిరంగంగానే పేర్కొంటున్నారు.
ఒక్కొక్కరుగా.. బహిరంగంగా.. : మాక్లూర్‌ మండలంలో ఇద్దరు సర్పంచుల భర్తలపై అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు వెళ్లాయి. ముల్లంగి సర్పంచి భర్త శ్యాంరావు ఇసుక వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు చెందిన ఇసుక డంపులను పోలీసులు సీజ్‌ చేశారు. మరుసటి రోజే గనులశాఖ అధికారి వెళ్లి పరిశీలించారు. ఇదంతా ఎమ్మెల్యే బెదిరింపు చర్చేనని సర్పంచి బహిరంగంగా ఆరోపణ చేస్తున్నారు. పైగా జడ్పీఛైర్మన్‌తో అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఓర్వకనే ఇలా చేయించారని ఆరోపించారు. శ్యాంరావు ఆరోపణలపై ఎమ్మెల్యేగాని, జడ్పీ ఛైర్మన్‌గాని స్పందించకపోవటం గమనార్హం. ఇప్పటికే ఆడిట్‌ పూర్తయిన కల్లెడి పంచాయతీ రికార్డులను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీలో నిధులు దుర్వినియోగమైందంటూ సర్పంచిపై సోమవారం ఫిర్యాదు వచ్చిందని, ఈ నేపథ్యంలోనే రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కల్లెడి సర్పంచి భర్త ప్రసాద్‌ సైతం బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఎమ్మెల్యేపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమపై కావాలనే దాడులు చేయిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు బయపడేది లేదన్నారు. తమ గ్రామ పాఠశాలకు జడ్పీ నిధులను కేటాయించారని, అందుకు జడ్పీ ఛైర్మన్‌ను సన్మానిస్తే ఓర్వలేక బెదిరింపులకు దిగుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.
పోటీనే కాదు..వైరమేలా? :  జడ్పీ ఛైర్మన్‌ అధికార పార్టీలో సీనియర్‌ నేత. ఆయన విధేయతకు చాలాకాలం తర్వాత పదవి దక్కింది. రానున్న రోజుల్లో ఆయన ఏ పదవి ఆశిస్తున్నారు? పార్టీలో ఏ స్థానాన్ని కోరుకుంటున్నారనే విషయాలపై చర్చే లేదు. ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో బలమైన నాయకుడు. వీరి ఇద్దరి మధ్య వచ్చే ఎన్నికల్లో సీటు విషయంలో పీటముడి పరిస్థితుల్లేవు. కానీ, ఎందుకు వైరం ఉందనే చర్చ సొంత పార్టీలోనే సాగుతోంది. చిన్నపాటి భేదాభిప్రాయాలే వీరి మధ్య దూరాన్ని పెంచాయని కార్యకర్తలు పేర్కొంటున్నారు. నేతలిద్దరు సమన్వయం చేసుకోలేకపోవడం వల్లే తాము నలిగిపోవాల్సి వస్తోందని ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు.
రాజకీయ వర్గాల్లో చర్చ.. : రాజకీయ పార్టీల్లో వర్గపోరు సహజమే. అంతర్గతంగా ఉన్నంత కాలం ఎవరూ పట్టించుకోరు. కానీ, సొంత పార్టీ వారే తమ నాయకుడిపై బహిరంగ ఆరోపణలు చేసే స్థాయికి చేరడం చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. గులాబీ దళపతి సైతం పార్టీ శ్రేణులకు పలు సందర్భాల్లో ఇదే విషయంలో దిశా నిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న వివాదాలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని, తప్పెవరిది? ఏ విషయంలో పొసగటం లేదనేది వారే తేల్చుకోవాలి? అని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు