logo

ఫోన్లు పట్టుండ్రి.. టీవీలు పెట్టుండ్రి

కొవిడ్‌ మూడో ముప్పు రానే వచ్చింది. గతేడాది సెస్టెంబరు 1 న ప్రారంభమైన బడులు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగాయి. మధ్యలో దసరా, క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులు రాగా ప్రస్తుతం కొవిడ్‌ వైరస్‌ ఉద్ధృతి కారణంగా పాఠాల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

Published : 20 Jan 2022 02:40 IST

మళ్లీ ఆన్‌లైన్‌ పాఠాలు

వరుస సెలవులతో తప్పని అగచాట్లు 

ప్రభుత్వ బడుల్లో స్పష్టత కరవు
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బడిలో తరగతులు

కొవిడ్‌ మూడో ముప్పు రానే వచ్చింది. గతేడాది సెస్టెంబరు 1 న ప్రారంభమైన బడులు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగాయి. మధ్యలో దసరా, క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులు రాగా ప్రస్తుతం కొవిడ్‌ వైరస్‌ ఉద్ధృతి కారణంగా పాఠాల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నెల 17న ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా 30 వరకు సెలవులు పొడిగించారు. అసలే పాఠ్యాంశాలపై పట్టు కోల్పోతుండగా తాజా పరిణామాలతో పరిస్థితి మొదటికొచ్చింది.
ప్రైవేటులో  మొదలుపెట్టేశారు
ప్రభుత్వం సెలవులు ప్రకటించింది తప్ప డిజిటల్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు కరవయ్యాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్నాయి. ప్రభుత్వ బడులపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. తల్లిదండ్రుల చొరవ అంతంతమాత్రంగానే ఉంది. రెండేళ్లపాటు స్మార్ట్‌ఫోన్‌, టీవీ తదితర పరికరాల్లో టీషాట్‌ ద్వారా పాఠాలు బోధించగా ప్రస్తుతం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
 కరోనా కారణంగా విద్యా సంవత్సరం మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. జూన్‌ 12న మోగాల్సిన బడిగంట సెప్టెంబరు 1 దాకా మోగలేదు. అంతకు ముందు వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా ఆలకించింది 55- 60 శాతం లోపే. ఎక్కువగా పదో తరగతి విద్యార్థులు మాత్రమే విన్నారు. ఈ నెలాఖరు వరకే సెలవులిచ్చినా పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకు సన్నద్ధంకాక తప్పేలా లేదు. ఎంతమంది విద్యార్థుల ఇళ్లలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయో వివరాలు సేకరించాలి. లేని వారికి పంచాయతీల సహకారంతో సామాజిక టీవీలు ఏర్పాటు చేయాలి. టీవీలు లేని వారు సమీపంలోని విద్యార్థుల ఇళ్లలో పాఠాలు వినేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.  

ఆయా శాఖల  సమన్వయంతోనే
డిజిటల్‌ పాఠాలకు పంచాయతీరాజ్‌, విద్యుత్తుశాఖల భాగస్వామ్యం అవసరమని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ప్రసార సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి. డిజిటల్‌ తరగతుల్లో అప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసే అవకాశాలు లేవు. దీంతో తరగతుల వారీగా విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల చరవాణి నంబర్లతో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి సంప్రదించే అవకాశం కల్పించాలి.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు
- రాజు, జిల్లా విద్యాశాఖాధికారి, కామారెడ్డి

కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్న కారణంగా ప్రభుత్వం సంక్రాంతి సెలవులను 13 రోజులు పొడిగించింది. ఇప్పటి వరకైతే డిజిటల్‌ తరగతుల నిర్వహణపై స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ఉపాధ్యాయులు చరవాణి ద్వారా పిల్లలను పర్యవేక్షించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని