logo

వసతులపై ఊపిరి పీల్చుకోవచ్చు

ఊహించినట్లే కొవిడ్‌ మూడో ముప్పు వచ్చింది. తొలి, రెండో దశలో వైరస్‌ వ్యాప్తితో వేల మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మొదటి దశలో ఆసుపత్రిలో కొవిడ్‌ ఐసీయూ సెల్‌ ఏర్పాటు చేసినా వైరస్‌ బారిన పడిన వారు తక్కువ మంది చికిత్స నిమిత్తం వచ్చారు. రెండో దశలో అంచనాలు తలకిందులయ్యాయి. వందల మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరికి చికిత్స అందించడం  గగనమైంది. మూడో దశ వచ్చేలోగా ప్రభుత్వం జిల్లా ఆసుపత్రుల్లో సదుపాయాలను సిద్ధం చేసింది.

Published : 20 Jan 2022 02:40 IST

 జిల్లాలో 310 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం

కొవిడ్‌ మొదటి, రెండో ఉద్ధృతితో తీవ్ర ఇబ్బందులు

న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం

కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో సిద్ధమైన ఆక్సిజన్‌ ప్లాంటు

ఊహించినట్లే కొవిడ్‌ మూడో ముప్పు వచ్చింది. తొలి, రెండో దశలో వైరస్‌ వ్యాప్తితో వేల మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మొదటి దశలో ఆసుపత్రిలో కొవిడ్‌ ఐసీయూ సెల్‌ ఏర్పాటు చేసినా వైరస్‌ బారిన పడిన వారు తక్కువ మంది చికిత్స నిమిత్తం వచ్చారు. రెండో దశలో అంచనాలు తలకిందులయ్యాయి. వందల మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరికి చికిత్స అందించడం  గగనమైంది. మూడో దశ వచ్చేలోగా ప్రభుత్వం జిల్లా ఆసుపత్రుల్లో సదుపాయాలను సిద్ధం చేసింది. జిల్లాలో 310 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో వసతుల కల్పనపై దృష్టిపెట్టారు.

జిల్లా ఆసుపత్రిలో  అత్యధికంగా

కొవిడ్‌ రెండు దశల్లో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు 670 కాగా అందులో ప్రాణాలు కోల్పోయిన వారు 42 మంది ఉన్నారు.  తొలి విడతలో 100 పడకల ఆసుపత్రిలో 10 మాత్రమే ఐసీయూ పడకలు కేటాయించారు. అప్పుడు వైరస్‌ తీవ్రత అంతగా లేదు. రెండో విడతలో 30 పడకలు కేటాయించగా రోగులు మూడింతలయ్యారు. వీరికి చికిత్స అందించడం కష్టతరమైంది. నిత్యం పదుల సంఖ్యలో బాధితులు ప్రాణవాయువు అందక జిల్లా ఆసుపత్రికి వచ్చి ఇబ్బందులు పడ్డారు. అత్యధిక కేసులను హైదరాబాద్‌, నిజామాబాద్‌కు సిఫారసు చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతతో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజులకు ఒకసారి సిలిండర్లు సమకూరినా సమస్య తీరలేదు. ఇది గ్రహించిన యంత్రాంగం అన్ని పడకలకు ప్రాణవాయువు సౌకర్యం కల్పించాలని నివేదిక రూపొందించింది. ఎనిమిది నెలల్లోనే అన్ని పడకలకు కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ఆక్సిజన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేసింది.

అందుబాటులో  ఔషధాలు

పాజిటివ్‌ వచ్చిన వారికి ఐసోలేషన్‌ కిట్లు అందజేస్తున్నారు. అజిత్రోమైసిన్‌, డోలో-650, సిటిరైజన్‌, జింక్‌, మల్టీవిటమిన్‌ మాత్రలతో పాటు దగ్గు మందును అందజేస్తున్నారు. ఔషధాలతో పాటు మాస్క్‌లు, శానిటైజర్‌ ఇస్తున్నారు. సమస్య తీవ్రమైతే వైద్యులు నిర్దేశించిన ఔషధాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

పెరుగుతున్న  కేసులు

జిల్లాలో ఈ నెల 7 నుంచి పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ సోకిన వారు హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులపై వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో వైరస్‌ తారస్థాయికి చేరి తగ్గుముఖ పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

నిల్వ ప్లాంటు ఏర్పాటు

* కామారెడ్డి జిల్లా ఆసుపత్రితో పాటు బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో 500 ఎల్‌పీఎం సామర్థ్యం కలిగిన ప్రాణవాయువు నిల్వ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 

* కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో వీటిని నెలకొల్పారు. అన్ని పడకలకు పైపులైన్‌ ద్వారా అనుసంధానం చేశారు. మూడో దశలో కేసులు పెరిగి ఆసుపత్రుల్లో చేరినా ఆక్సిజన్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యాధికారులు చెబుతున్నారు.

ఈసారి తీవ్రత తక్కువే..

- అజయ్‌కుమార్‌, ఆసుపత్రుల జిల్లా పర్యవేక్షణాధికారి

పాజిటివ్‌ వచ్చినా చాలా మంది ఇళ్ల వద్దే కోలుకుంటున్నారు. ఈసారి ఆరోగ్య పరిస్థితులు విషమించేలా వైరస్‌ రూపాంతరం చెందలేదు. ప్రస్తుతం జ్వరం, జలుబు, ఒంటినొప్పులు తదితర లక్షణాలు మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటున్నాయి. ఆ తర్వాత అనారోగ్యం నుంచి బయటపడుతున్నారు. వైద్యశాఖపరంగా ప్రధాన ఆసుపత్రుల్లో అన్ని పడకలకు ప్రాణవాయువు వసతి కల్పించాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు    చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని