logo

అభివృద్ధి బాటలో...

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేవి రహదారులే. వీటి అభివృద్ధిపైనే ఆయా ప్రాంతాల ప్రగతి ఆధారపడి ఉంటుంది. దేశంలో చాలా జిల్లాలు జాతీయ రహదారుల కారణంగా ఎంతో అభివృద్ధిని సాధించాయి. జిల్లా నుంచి

Published : 21 Jan 2022 03:35 IST

 మెదక్‌- భైంసా ఎన్‌హెచ్‌ నిర్మాణానికి సర్వే
 కరీంనగర్‌- పిట్లం నాలుగు వరుసల రోడ్డుకు ప్రతిపాదనలు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

పూర్తయిన ఎస్‌-ఎన్‌-ఎ-161 జాతీయ రహదారి

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేవి రహదారులే. వీటి అభివృద్ధిపైనే ఆయా ప్రాంతాల ప్రగతి ఆధారపడి ఉంటుంది. దేశంలో చాలా జిల్లాలు జాతీయ రహదారుల కారణంగా ఎంతో అభివృద్ధిని సాధించాయి. జిల్లా నుంచి రాజధానికి ఎన్‌హెచ్‌- 44 వెళ్తుండగా మరో ఎస్‌-ఎన్‌-ఎ-161 నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కొత్తగా మంజూరైన మెదక్‌- భైంసా జాతీయ రహదారి కోసం భూసేకరణ చేపడుతున్నారు. జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే కరీంనగర్‌- పిట్లం రోడ్డును ఎన్‌హెచ్‌గా మార్చేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వీటితో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. పారిశ్రామికంగా పురోగమిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా నిర్మాణాల స్థితిగతులు, భూసేకరణపై ప్రత్యేక కథనం.
తుది దశకు..
* కేంద్ర ప్రభుత్వం అయిదేళ్ల క్రితం సంగారెడ్డి- నాందేడ్‌- అకోలా(ఎస్‌ఎన్‌ఏ- 161) జాతీయ రహదారి విస్తరణకు రూ.2380 కోట్లు మంజూరు చేసింది.
* మూడు ప్యాకేజీలుగా విభజించి రెండు వరుసలుగా ఉన్న 130 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించేందుకు పనులు చేపట్టారు.
* మూడో ప్యాకేజీ కింద నిజాంసాగర్‌ మండలం నర్సింగరావుపల్లి చౌరస్తా నుంచి మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ వరకు 49 కి.మీ. మేర విస్తరణ పనులు పూర్తి చేశారు.
* రెండ్రోజుల కిందట పిట్లం మండలంలోని ధర్మారం వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాను ప్రారంభించి టోల్‌ వసూలు చేస్తున్నారు.
* మొదటి, రెండో ప్యాకేజీల కింది మిగిలిన పనులను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నో ఉపయోగాలు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గాలను ఎన్‌హెచ్‌లుగా ప్రకటించాలని ప్రతిపాదనలు పంపించింది. ఇందులో కరీంనగర్‌- పిట్లం రహదారి ఉంది. 149 కి.మీ.ఉన్న ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో 73 కి.మీ. ఉండగా కామారెడ్డి జిల్లాలో 76 కి.మీ. ఉంది. ఇది ఈ మూడు జిల్లా కేంద్రాలను కలుపుతుంది. విపరీతంగా రద్దీ ఉండే ఈ మార్గం విస్తరణకు జాతీయ రహదారుల విభాగం ధ్రువ్‌ అనే సంస్థకు అప్పజెప్పింది.
హెచ్‌ఎంబీ కోసం భూసేకరణ
హైదరాబాద్‌- మెదక్‌- భైంసా(హెచ్‌ఎంబీ) రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది.

* 95 కి.మీ. ఉన్న ఈ రోడ్డు ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 32 కి.మీ, బాన్సువాడలో 32 కి.మీ, బోధన్‌ పరిధిలో 11 కి.మీ. ఉంది.

 * ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి కాగా భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

* బాన్సువాడ డివిజన్‌ పరిధిలోని నర్వ, కొత్తబాది గ్రామాల్లో శుక్రవారం సర్వే చేపట్టి మార్కింగ్‌ చేయనున్నారు.

* ఇది పూర్తయితే బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాల ప్రజలు మెదక్‌ మీదుగా రాజధానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని