logo

కోరలు చాస్తున్న కరోనా!

జిల్లాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం 455 మంది వైరస్‌ బారిన పడ్డారు. తొలి, రెండో దశల కంటే మూడోసారి వ్యాప్తి అత్యంత వేగంగా ఉండటంతో జాగ్రత్తల

Published : 21 Jan 2022 03:35 IST

న్యూస్‌టుడే: నిజామాబాద్‌ వైద్యవిభాగం

జిల్లాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం 455 మంది వైరస్‌ బారిన పడ్డారు. తొలి, రెండో దశల కంటే మూడోసారి వ్యాప్తి అత్యంత వేగంగా ఉండటంతో జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు.
వారం రోజులుగా
గతంలో ఎన్నడూ లేనివిధంగా వారం రోజులుగా వైరస్‌ వ్యాప్తి వేగం  పుంజుకొంది. ఈ నెల 14 నుంచి ఇప్పటి వరకు 7,348 కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 2071 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. అంతకు ముందు వారంతో పోల్చితే ఈ సంఖ్య ఐదింతలు పెరగడం గమనార్హం.
వైద్యులు.. సిబ్బంది...
మూడోదశలో వైరస్‌ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. నెలరోజులుగా జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్యులు 25, సిబ్బంది 20 మంది కొవిడ్‌ బారినపడ్డారు. వీరందరూ స్వల్ప లక్షణాలతో కోలుకొని మళ్లీ విధులు నిర్వహిస్తున్నారు. మరో 8 మంది వైద్యులు, నలుగురు సిబ్బంది ఐసోలేషన్లో ఉన్నారు. ప్రైవేటు దవాఖానా వైద్యులు, సిబ్బంది సైతం భారీగానే కరోనా బారిన పడుతున్నారు.
అన్ని చోట్ల..
జిల్లాలో ఉన్న అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధితులు బారులు తీరుతున్నారు.
6,372 మందికి టీకా
నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల్లో గురువారం 6,372 మందికి టీకాలు వేశారు. వీరిలో టీనేజర్లు 155, 18-44 వయసువారు 2448, 45-59 ఏళ్లవారు 639, 60 ఏళ్లు పైబడినవారు 512, బూస్టర్‌ డోసు తీసుకున్నవారు 2,618 మంది ఉన్నారు.
అన్ని కేంద్రాల్లో బూస్టర్‌ డోసు
నిజామాబాద్‌ వైద్యవిభాగం: శుక్రవారం నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో బూస్టర్‌ డోసు అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా టీకా అధికారి శివశంకర్‌ తెలిపారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లోనే టీకా వేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం కొవిషీల్డ్‌ 72 వేలు, కొవాగ్జిన్‌ 21 వేల డోసులు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
రెంజల్‌ పీహెచ్‌సీలో ఐదుగురికి..
రెంజల్‌: రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గురువారం 42 కొవిడ్‌ పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌ నిర్దారణైంది. మండలంలో నాలుగు రోజుల వ్యవధిలో 18 మందికి కరోనా రావడం గమనార్హం.
బోధన్‌ జిల్లా ఆసుపత్రిలో 35 మందికి..
బోధన్‌ పట్టణం: బోధన్‌ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గురువారం 68 ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 35 మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. వీరికి హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేశారు. రోజుకు 30కి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.
జక్రాన్‌పల్లిలో మూడు..
జక్రాన్‌పల్లి: మండలకేంద్రంలోని పీహెచ్‌సీలో గురువారం 15 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్యసిబ్బంది తెలిపారు.
ఆర్మూర్‌లో 17
ఆర్మూర్‌ పట్టణం: ఆర్మూర్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో గురువారం 17 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సూపరిండెంటెంట్‌ నాగరాజు తెలిపారు.
రుద్రూర్‌లో ముగ్గురికి ...
రుద్రూర్‌: రుద్రూర్‌ పీహెచ్‌సీలో గురువారం 10 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణైనట్లు వైద్యాధికారి దిలీప్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని