logo

ఇళ్లు.. ఏళ్లు

ఇళ్లు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది. ఆకతాయిలు కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. పంపులు.. కరెంటు బోర్డులు ఎత్తుకెళ్లారు. ప్రజాధనం వృథా అవుతున్న తరుణంలో ఎట్టకేలకు యంత్రాంగంలో కదలిక వచ్చింది.

Published : 21 Jan 2022 03:35 IST

 ఎట్టకేలకు కదలిక..
 పంపిణీపై కసరత్తు
ఈనాడు, నిజామాబాద్‌

నిజామాబాద్‌ నగరం నాగారంలో పూర్తయి పంపిణీ జరగని గృహాలు

ఇళ్లు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది. ఆకతాయిలు కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. పంపులు.. కరెంటు బోర్డులు ఎత్తుకెళ్లారు. ప్రజాధనం వృథా అవుతున్న తరుణంలో ఎట్టకేలకు యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆయా నిర్మాణాలు నిరూపయోగంగా మారక ముందే అర్హులకు అప్పగించాలని నిర్ణయించారు. దరఖాస్తుల పరిశీలనకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను అధిగమించే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాకు సుమారుగా 10 వేల ఇళ్లు మంజూరయ్యాయి. అన్నింటికి టెండర్లు పూర్తయి పనులు మొదలయ్యాయి. వీటిలో 2 వేల వరకు మాత్రమే పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణ వ్యయం పెరగటంతో గుత్తేదార్లు మధ్యలోనే వదిలేసిన చోట పురోగతి మందగించింది. మిగతా చోట్ల తుది దశలో ఉన్నా.. అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కరోనా కారణంగా కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. ఇక పూర్తయిన వాటిలో వర్ని, రుద్రూర్‌, కోటగిరి, వేల్పూర్‌, డిచ్‌పల్లిలలో సుమారు వెయ్యి వరకు పంపిణీ జరిగింది. మరో వెయ్యి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

నిరీక్షణ: నిజామాబాద్‌ నగరంలో 396 పూర్తయి సుమారు మూడేళ్లు కావొస్తోంది. బోధన్‌ పట్టణంలోనూ 400 ఇళ్లు చాలాకాలం కిందటే పూర్తయి.. చిన్న పనులు చేసి లబ్ధిదారులకు అప్పగించే స్థితిలో ఉన్నాయి. రుద్రూర్‌ జేఎన్‌సీ కాలనీ, అక్బర్‌నగర్‌లతో పాటు కోటగిరి మండలం పొతంగల్‌లోనూ పూర్తయి లబ్ధిదారులు చేరటమే తరువాయిగా ఉన్నాయి. కొన్నిచోట్ల స్థానిక నాయకులు తమ వార్డు, గ్రామం నుంచే లబ్ధిదారులను ఎంపిక చేయాలంటూ నేతల వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంపిక ప్రక్రియ ప్రజాప్రతినిధులకు కొంత తలనొప్పిగా మారింది.  
అర్హులను తేల్చే పనిలో..: నిజామాబాద్‌ నగరంలో గడిచిన ఏడేళ్లుగా 33 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేశారు. ప్రాథమిక పరిశీలనలో 10 వేల మంది రెండుసార్లు చేసినట్లు తేలింది. సకల జనుల సర్వే నివేదికతో పోల్చి చూడటంతో అవికాస్త 13 వేలకు తగ్గాయి. మిగతావి అనర్హతకు గురయ్యాయి. స్థిరనివాసం, ఇతర ప్రాంతాల్లో ఆస్తులు, ఆదాయ వివరాలతో పోల్చి చూడగా.. 5 వేలకు చేరాయి. వీటిలో రెండు పడకల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన నిబంధనలతో సరిపోలేవి 3 వేలు ఉన్నట్లుగా తేల్చారు. బోధన్‌ పట్టణంలో 5 వేలు, ఆర్మూర్‌లో 4 వేల దరఖాస్తులు ఉన్నాయి. వీటి పరిశీలన చేసే పనిలో ఉన్నారు.  
ఆకతాయిలు ధ్వంసం చేసిన కిటికీ  
త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక : చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌

క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా కొంత జాప్యం జరిగింది. పూర్తయిన ఇళ్లను అర్హులైన వారికి అందించేందుకు దరఖాస్తుల పరిశీలన చేయిస్తున్నాం. ఈ ప్రక్రియ తుది దశలో ఉంది. డ్రా పద్ధతిలో పూర్తయిన ఇళ్లను కేటాయించాల్సి ఉంటుంది. తుది దశలో ఉన్న నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించి నిరుపేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ పనిలో తహసీల్దార్లు, ఆర్డీవోలు నిమగ్నమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని