logo

పార్కింగ్‌ లేక పాట్లు

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. ఇందుకు పార్కింగ్‌ స్థలాలు లేకపోవడమే ప్రధాన కారణం. ప్రైవేటు వ్యాపార సంస్థలకు విధిగా పార్కింగ్‌ సదుపాయం లేకున్నా కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నారు. మరోవైపు ఎక్కడా పెయిడ్‌ పార్కింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి తేవట్లేదు. మరోవైపు ఈ-చలానాల బాదుడుతో అదనపు భారం పడుతోంది.

Published : 22 Jan 2022 03:30 IST

నగరంలో వాహనాలు నిలిపేందుకు కానరాని స్థలాలు
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ, నిజామాబాద్‌ నగరం

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. ఇందుకు పార్కింగ్‌ స్థలాలు లేకపోవడమే ప్రధాన కారణం. ప్రైవేటు వ్యాపార సంస్థలకు విధిగా పార్కింగ్‌ సదుపాయం లేకున్నా కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నారు. మరోవైపు ఎక్కడా పెయిడ్‌ పార్కింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి తేవట్లేదు. మరోవైపు ఈ-చలానాల బాదుడుతో అదనపు భారం పడుతోంది.

నగరంలో దాదాపు 1.60 లక్షల వాహనాలున్నాయి. 90 వేల ద్విచక్రవాహనాలు, 25వేల కార్లు, ఆటోలు ఉన్నాయి. వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చే వాహనదారులు 40 వేల వరకు ఉంటారు. నగరంలో తిరిగే వాహనాలకు ప్రభుత్వపరంగా పార్కింగ్‌ సదుపాయాలు లేవు. దీంతో ఎక్కడ పడితే అక్కడే వాహనాలను నిలుపుతున్నారు. ప్రధానంగా ఖలీల్‌వాడి, బస్టాండు, నెహ్రూపార్క్‌, వీక్లిమార్కెట్‌, కుమార్‌గల్లీ, పూసలగల్లీ, బోధన్‌ రోడ్డు, బడాబజార్‌, హైదరాబాద్‌ రోడ్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఖలీల్‌వాడిలోనైనా..
గతంలో నగర పాలక సంస్థ పరంగా పెయిడ్‌ పార్కింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ప్రకటించారు. అనంతరం దీనిపై దృష్టి పెట్టలేదు. సమస్య తీవ్రంగా ఉన్న ఖలీల్‌వాడిలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం ఆవరణను ఇందుకు వీలుగా మార్చాల్సి ఉంది. ఈ విషయంలో నగరపాలక సంస్థ, పోలీసులు సమన్వయంతో ముందుకెళ్లేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలి.

అనుమతులకు విరుద్ధంగా  నిర్మాణాలు
పట్టణ ప్రణాళిక నిబంధనల ప్రకారం వాణిజ్య భవనాలకు కచ్చితంగా పార్కింగ్‌ సౌకర్యం ఉండాలి. అగ్నిమాపక వాహనం తిరిగేలా సెట్‌బ్యాక్‌ వదలాలి. కానీ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఖలీల్‌వాడిలో కొందరు మొదట ఇంటి కోసం అనుమతి తీసుకొని వైద్యశాలలుగా మారుస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం సమస్యను పెంచుతోంది.

చలానాల  బాదుడు
ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు ఈ-చలానాలు బాదేస్తున్నారు. రోడ్లపై నిలిపే వాహనాలకు రూ.235 చొప్పున జరిమానా వేస్తున్నారు. రోజుకు 100కు పైగా జారీ అవుతున్నాయి. వీటి విలువ నెలకు రూ.6 లక్షలకుపైగా ఉంది.


వ్యాపారులకు చెప్పాం
- వికాస్‌, డిప్యూటీ సిటీ ప్లానర్‌(డీసీపీ), నగర పాలక సంస్థ

వాణిజ్య సంస్థల ప్రతినిధులు, దుకాణాదారులు వారి సెల్లార్లలోనే వాహనాలు నిలపాలి. ఈ విషయాన్ని వ్యాపారులకు చాలాసార్లు చెప్పాం. రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తాం.


అధికారులు దృష్టి సారించాలి

- వి.కిరణ్‌, నిజామాబాద్‌
నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది ఇక్కడికొచ్చి వెళ్తున్నారు. వాహనాల వినియోగం కూడా పెరిగింది. దీనికి తోడు రోడ్లు సరిగా లేవు. బస్టాండ్‌, ఖలీల్‌వాడి ప్రాంతాల్లో వాహనం నిలపాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి నగరాభివృద్ధిలో భాగంగా ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని