logo

గిరి వికాసం.. సమన్వయలోపం

మెట్ట భూముల్లో పంటలు సాగు చేసేందుకు గిరిజన రైతుల కోసం ప్రభుత్వం గిరి వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్నదాతలకు ఖర్చు లేకుండా వారి వ్యవసాయ భూముల్లో బోర్‌ వేయడంతో పాటు విద్యుత్తు సౌకర్యం కల్పించి పంపు మోటార్‌ బిగిస్తారు.

Published : 22 Jan 2022 03:30 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

దోన్కల్‌లో సర్వే చేస్తున్న అధికారులు

మెట్ట భూముల్లో పంటలు సాగు చేసేందుకు గిరిజన రైతుల కోసం ప్రభుత్వం గిరి వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్నదాతలకు ఖర్చు లేకుండా వారి వ్యవసాయ భూముల్లో బోర్‌ వేయడంతో పాటు విద్యుత్తు సౌకర్యం కల్పించి పంపు మోటార్‌ బిగిస్తారు. ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న ఈ పథకానికి స్పందన కరవైంది.

నిబంధనలతో ఇక్కట్లు..
గిరి వికాసం పొందే వారికి ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఇద్దరు లేక ముగ్గురు సన్నకారు రైతులకు కలిపి ఐదెకరాలకు తగ్గకుండా ఒకే చోట భూమి ఉండాలి. పట్టా ఉన్న మెట్ట భూమి ఉంటేనే అర్హులుగా పరిగణిస్తారు. ఎక్కువ మందికి కలిపి ఒక యూనిట్‌ మంజూరు చేస్తే తగాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని భావించి దరఖాస్తు చేసుకోవట్లేదు. రైతు వారీగా యూనిట్‌ మంజూరు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
దరఖాస్తులను ఆర్‌ఐ, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సాంకేతిక సహాయకులు, విద్యుత్తు లైన్‌మెన్‌ పరిశీలించడంతో పాటు భూమిలో నీళ్లు పడతాయా లేదా అనేది భూగర్భ జలవనరుల శాఖాధికారులు పరిశీలిస్తారు. వారు నిర్ధారించిన తర్వాతే బోర్‌ వేస్తారు. అనంతరం సంబంధిత దరఖాస్తును గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిస్తారు.

నివేదికల్లో జాప్యం..
దళిత, గిరిజనులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2004లో ఇందిర జలప్రభ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద జిల్లాలో రూ. 90 కోట్ల మేరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం దీని స్థానంలోనే గిరి వికాసాన్ని అమలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకంపై తొలుత ప్రచారం చేయలేదు. గతేడాది నుంచి పల్లెల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా కేవలం 39 దరఖాస్తులు వచ్చాయి. వీటి క్షేత్రస్థాయి పరిశీలనలో జాప్యం జరుగుతోంది. భూగర్భ జలవనరుల శాఖ నుంచి నివేదిక గ్రామీణాభివృద్ధి శాఖకు పంపడంలో ఆలస్యమవుతోంది. వారితో పాటు విద్యుత్తు ఏఈ, ఉపాధి హామీ ఏపీవో నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండట్లేదు.


అర్హులకు అందిస్తాం
- సంజీవ్‌కుమార్‌, ఏపీడీ, గ్రామీణాభివృద్ధి శాఖ, నిజామాబాద్‌

గిరిజన తండాలు, పంచాయతీల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఐదెకరాలు ఒకే చోట ఉండాలనే నిబంధన ఉంది. దరఖాస్తులను ఉపాధి హామీ ఏపీవోలకు ఇవ్వవచ్చు. వాటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారు ఉంటే బోర్‌ వేయడంతో పాటు విద్యుత్తు కనెక్షన్‌ ఇస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని