logo

ఆస్తుల విలువ మదింపు

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువ అధికారికంగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని భూముల విలువ మదింపులో అధికారులు తలమునకలయ్యారు.

Published : 24 Jan 2022 04:08 IST

జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువ అధికారికంగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని భూముల విలువ మదింపులో అధికారులు తలమునకలయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి ప్రతిపాదనలను కలెక్టర్‌ ద్వారా నివేదించనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి అధికారులు అన్ని జిల్లాల రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఐదు కార్యాలయాల పరిధిలో ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలు, తాజాగా పెంచాల్సిన వాటిని మదింపు చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెంపు ప్రతిపాదనలు ఇలా..

* ఎకరం వ్యవసాయ భూమికి ప్రస్తుతం అమల్లో ఉన్న ధరపై 50శాతం అదనంగా విలువ పెరగనుంది.

* ఇదే విధంగా వ్యవసాయేతర భూములకు తాజా ప్రతిపాదనల మేరకు ఖాళీ స్థలాలకు చదరపు గజానికి ప్రస్తుతం ఉన్న ధరపై 35శాతం పెంచనున్నారు.

* చదరపు గజం రూ.వెయ్యి ఉంటే తాజా ప్రతిపాదనల మేరకు రూ.1350కి పెరుగుతుంది. అపార్టుమెంట్లలోని ఫ్లాట్లకు చదరపు అడుగుకు ఇప్పుడున్న మూల ధరపై రూ.25 శాతం పెంచనున్నారు.

ఎలా నిర్ణయిస్తారంటే

ప్రస్తుతం రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న తంతు ప్రాథమిక దశ మాత్రమే. వ్యవసాయంతో పాటు ఇతర భూముల మార్కెట్‌ విలువను నిర్ణయించేందుకు రిజిస్ట్రేషన్లశాఖ, పట్టణ, గ్రామీణ స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో జాయింట్‌ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవోలు నేతృత్వం వహిస్తారు. సబ్‌ రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. వీరు స్థానిక బిల్డర్లు, రియల్టర్లు, ఇతర నిర్మాణరంగ ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుంటారు. అనంతరం ఎంతమేరకు పెంచవచ్చో ప్రభుత్వానికి నివేదిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు సమీక్షించి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు సీఎంకు నివేదిక అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు