logo

‘ఏడాదిలో ఆర్వోబీ పూర్తవ్వాలి’

మాధవనగర్‌ ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతులివ్వడం హర్షించదగ్గ విషయమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఎనిమిదేళ్లుగా ఆలస్యమవుతున్న వంతెన....

Published : 24 Jan 2022 04:43 IST

మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌, చిత్రంలో పల్లె గంగారెడ్డి, బస్వా లక్ష్మీనర్సయ్య, ధన్‌పాల్‌ సూర్యనారాయణ

ఈనాడు, నిజామాబాద్‌ : మాధవనగర్‌ ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతులివ్వడం హర్షించదగ్గ విషయమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఎనిమిదేళ్లుగా ఆలస్యమవుతున్న వంతెన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ దిశగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహకరించాలన్నారు. ఈ అంశంపై ఆయన ఆదివారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో రెండు వరుసలకు అనుగుణంగా వంతెన మంజూరైందని.. కానీ నాలుగు వరుసలుగా నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వమే రైల్వేశాఖకు చెప్పిందన్నారు. ఎలాంటి శాస్త్రీయ నివేదికలు లేకుండా లేఖ రాయడంతో అనుమతుల్లో జాప్యం నెలకొందన్నారు. తాను ఎంపీ అయ్యాక ట్రాఫిక్‌ సర్వే చేయించడం వల్లే నాలుగు వరుసల వంతెనకు రైల్వేశాఖ అనుమతులిచ్చినట్లు వివరించారు. అర్సపల్లి వంతెనకు రైల్వే అనుమతులు తీసుకురావాలంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంపీని ఉద్దేశించి శనివారం మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై అర్వింద్‌ స్పందిస్తూ.. అర్సపల్లి, బోధన్‌ వంతెనలకు రైల్వేశాఖ చేయాల్సిన పని పూర్తయిందని.. రాష్ట్ర ప్రభుత్వమే డీపీఆర్‌లు పంపాల్సి ఉందన్నారు. అనంతరం కేంద్రం వాటా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు.

ఏ ఆధారాలతో కేసు పెట్టారు?

ఎంపీనని కూడా చూడకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ విషయంలో వ్యవహరించిన తీరుకు పర్యవసానం ఏమైందో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. పోలీసులు, అధికారులకు లోక్‌సభ ప్రివిలైజ్‌ కమిటీ నోటీసులిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర నాయకులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతిరెడ్డి, మీసాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని