logo

..అందుకే శిరస్త్రాణం శిరోధార్యం

శిరస్త్రాణం ముఖ్యమని పోలీసులు తరచూ సూచిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు.

Published : 24 Jan 2022 04:43 IST

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే

రోడ్డు ప్రమాదంలో మరణించిన వీరి పేరు విశాల్‌(21), రాజు(21). వీరిది నాగారం. కూలి కోసం శనివారం రాత్రి వేరే ఊరికి వెళ్లారు. ఆదివారం ద్విచవ్రాహనంపై తిరిగొస్తుండగా నిజామాబాద్‌ ఆర్‌పీ రోడ్డులోని మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి దుకాణం షెట్టర్‌లోకి దూసుకెళ్లింది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. శిరస్త్రాణం ధరించి ఉంటే బతికేవారు.

శిరస్త్రాణం ముఖ్యమని పోలీసులు తరచూ సూచిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. అయినా ద్విచక్రవాహనదారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. ధరించకుండా వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. ఇదే కారణంతో తాజాగా ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఇక నుంచైనా అందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది.

ఏటా 80 మందికిపైగా..

కేవలం శిరస్త్రాణం ధరించని కారణంగా జిల్లాలో ఏటా 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి 300కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఇందులో 30 శాతం మరణాలు హెల్మెట్లు ధరించని కారణంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. నగరంలో తిరుగుతున్న వారు దూర ప్రయాణానికి వెళ్లట్లేదు కదా అని అశ్రద్ధ చూపిస్తున్నారు.

యువతే అధికం

ప్రధానంగా యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖరీదైన ద్విచక్రవాహనాలు వాడుతుండడంతో వేగానికి కళ్లెం ఉండట్లేదు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఘటనా స్థలాల్లోనే మరణిస్తున్నారు. తాజాగా ఎడపల్లిలో ఇద్దరు, డిచ్‌పల్లిలో ఒకరు, ఆర్మూర్‌లో మరో ఇద్దరు మృతి చెందారు.

జరిమానాలు విధిస్తున్నా..

నిజామాబాద్‌తో పాటు అన్ని ఠాణాల పరిధిల్లో రోజువారీగా ఈ-చలానాలు జారీ చేస్తున్నారు. మొదటిసారి ఉల్లంఘనకు రూ.135, రెండోసారి రూ.235 జరిమానా విధిస్తున్నారు. పలువురు వాహనదారులపై పదుల సంఖ్యలో ఈ-చలానాలు జారీ అయ్యాయి. అయినా శిరస్త్రాణం ధరించడంలో నిర్లక్ష్యం వీడట్లేదు.

బాధ్యతగా భావించాలి : నాగరాజు, సీపీ

ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం వాడాలి. యువతలో మార్పు తీసుకొచ్చేలా కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రమాదాలు జరిగి మృతిచెందిన వారి కేస్‌స్టడీలు, ఫొటోలతో వారికి అర్థమయ్యేలా వివరిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని