logo

మట్కా మాయ

మట్కా..! మహారాష్ట్ర కేంద్రంగా నడుస్తున్న జూదం తరహా ఆట. ఒక్కసారి దీనికి అలవాటు పడిన వారు రూ.లక్షలు ధారపోస్తున్నారు. ఉన్నది అమ్ముకొంటున్నారు. లేనివారు అప్పులు చేస్తున్నారు.

Published : 24 Jan 2022 04:43 IST

న్యూస్‌టుడే - నిజామాబాద్‌ నేరవార్తలు, బోధన్‌ పట్టణం

మట్కా..! మహారాష్ట్ర కేంద్రంగా నడుస్తున్న జూదం తరహా ఆట. ఒక్కసారి దీనికి అలవాటు పడిన వారు రూ.లక్షలు ధారపోస్తున్నారు. ఉన్నది అమ్ముకొంటున్నారు. లేనివారు అప్పులు చేస్తున్నారు. చివరకు పూర్తి వ్యసనపరులుగా మారి అప్పులు తీర్చలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో నిషేధం ఉన్నా కమిషనరేట్‌లో మట్కా డెన్‌లు నడుస్తుండడం, ఆన్‌లైన్‌లోనూ దారులు తెరిచి ఉండడంతో రోజురోజుకు మట్కారాయుళ్లు పెరిగిపోతున్నారు.

* ఇటీవల నిజామాబాద్‌లో ఓ వ్యక్తి మట్కాకు వ్యసనపరుడిగా మారి ఇల్లు తాకట్టు పెట్టాడు. చివరకు అప్పు చెల్లించకపోవడంతో వ్యాపారి ఇల్లును స్వాధీనం చేసుకొన్నాడు. దీంతో ఆ కుటుంబంలో ఒకరు ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. అస్తులన్నీ పోయి రోడ్డు మీదకు వచ్చిన తర్వాత మట్కా వదిలేశాడు.

* బోధన్‌కు చెందిన ఒకరు కొన్నేళ్ల క్రితం మట్కాకు బానిసయ్యాడు. ఆయనకు తొలినాళ్లలో అదృష్టం కలిసొచ్చింది. దీంతో ఆయన పేరుమీద కొందరు పెట్టుబడి పెట్టారు. వ్యాపారం భారీగా విస్తరించిన క్రమంలో ఒక్కసారిగా నష్టాలు ఆరంభమయ్యాయి. అప్పులు పెరిగిపోయి చివరకు ఉన్నదంతా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ధర్మాబాద్‌ కేంద్రంగా..

మహారాష్ట్రలో మట్కా విచ్చలవిడిగా నడుస్తోంది. సరిహద్దు జిల్లా కావడంతో అక్కడికి రాకపోకలు సాగుతుండటంతో పాటు ప్రజలతో సంబంధాలున్నాయి. ధర్మాబాద్‌ పట్టణ కేంద్రంగా అక్కడి ఏజెంట్లు నిజామాబాద్‌లో సబ్‌ ఏజెంట్లను నియమించుకొన్నారు. మట్కా ఆడేవారి కోసం వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. రోజు రూ.కోటికిపైగా ఇందులో వెచ్చిస్తున్నట్లు సమాచారం.

అడ్డాలు ఎక్కడంటే..

బోధన్‌ రోడ్డులో ఉండే ఓ రౌడీషీటర్‌ ప్రత్యేకంగా మట్కా అడ్డా తెరిచినట్లు సమాచారం. మిర్చికంపౌండ్‌, రైల్వేట్రాక్‌, బాబాన్‌సాహెబ్‌ పహాడ్‌ ప్రాంతాల్లో పలువురు ఏజెంట్లు మట్కా నడిపిస్తున్నారు. పెద్దబజార్‌, ఖిల్లారోడ్డు, గంజ్‌ మార్కెట్‌ ప్రాంతాల్లోనూ కొందరు ఏజెంట్లుగా మారి కమీషన్ల కోసం ఈ ఊబిలోకి దించుతున్నారు. ఈ అడ్డాలన్నింటిపై కమిషనరేట్‌ పోలీసులు దృష్టి సారించాల్సి ఉంది.

ఆన్‌లైన్‌లోనూ..

మట్కా కోసం ఇటీవల ఆన్‌లైన్‌ యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మహారాష్ట్ర కేంద్రంగా పలు ప్రైవేటు వెబ్‌సైట్లను కూడా తెరిచారు. ఇందులో చేరే వారికి ముందుగా ఒక ఐడీ సృష్టించి సభ్యులుగా చేర్చుతున్నారు. ఆన్‌లైన్‌లో 24 గంటలు ఆడేలా వ్యవస్థను తయారు చేయడంతో యువత సైతం బానిసగా మారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

పలువురిని గుర్తించాం : నాగరాజు, సీపీ

మట్కాపై ఉక్కుపాదం మోపాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఇటీవల నమోదైన పలు కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరెవరూ మట్కా నిర్వహిస్తున్నారనే విషయమై సాంకేతికపరమైన ఆధారాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే పలువురిని గుర్తించాం. వీలైనంత త్వరలో చర్యలు చేపడుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని