logo

చిత్ర వార్తలు

ఈ చిత్రంలో తాత్కాలిక గుడిసెలు వేసుకున్న వారు మెదక్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల నుంచి కామారెడ్డికి వలసొచ్చిన కూలీలు. ఏటా చెరుకు కోతకొచ్చే దశలో ఉపాధి కోసం ఎడ్లబండ్లను....

Updated : 24 Jan 2022 05:34 IST

 ఉపాధి వలస.. తాత్కాలిక బస

ఈ చిత్రంలో తాత్కాలిక గుడిసెలు వేసుకున్న వారు మెదక్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల నుంచి కామారెడ్డికి వలసొచ్చిన కూలీలు. ఏటా చెరుకు కోతకొచ్చే దశలో ఉపాధి కోసం ఎడ్లబండ్లను వెంటబెట్టుకొని కుటుంబ సభ్యులతో ఇక్కడికి వస్తుంటారు. పంట కోసి, కట్టలు కట్టి, ఎడ్లబండ్లపై కర్మాగారానికి తరలించే వరకు వారిదే బాధ్యతగా కూలీ మాట్లాడుకుంటారు. సుమారు మూడు నెలలు పని దొరుకుతుందని.. అనంతరం సొంతూరికి వెళ్తామని వారు చెబుతున్నారు.

- ఈనాడు, నిజామాబాద్‌


ఎరుపెక్కిన ఆకాశం

ప్రకృతి చిత్రాలు కనులకు ఇంపుగా కనిపిస్తాయి. సూరీడు అస్తమిస్తుండగా ఆకాశం ఎరుపెక్కి ఆ ప్రతిబింబం నీళ్లలో కనిపిస్తున్న దృశ్యం మోర్తాడ్‌ మండలం పాలెంలో ఆదివారం సాయంత్రం ఆవిష్కృతమైంది. చేయి తిరిగిన కళాకారుడి కుంచె నుంచి జాలువరినట్లు సహజ సిద్ధంగా ఉండి చూపరుల మనస్సు కట్టిపడేసింది.

- న్యూస్‌టుడే, మోర్తాడ్‌


చుక్‌ చుక్‌... చకచకా

నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విద్యుదీకరణ పనులు మరో నెల రోజుల్లో పూర్తికానున్నాయి. పట్టాల వెంట స్తంభాలు, తీగల ఏర్పాటుతో ఆవరణ మొత్తం కొత్త కళను సంతరించుకొంది. పెద్దపల్లి-కరీంనగర్‌-జగిత్యాల-నిజామాబాద్‌ మార్గంలో త్వరలోనే విద్యుత్తు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

- ఈనాడు, నిజామాబాద్‌


కాపు కాసే పాన్పు

యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వ చెప్పడంతో చాలామంది రైతులు అంతర పంటలపై దృష్టి సారించారు. వాటిని పక్షులు, కోతులు, అడవిపందుల నుంచి కాపాడుకోవడానికి కంటి మీద కునుకులేకుండా కాపాలా కాస్తున్నారు. రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో పురుగుపుట్ర నుంచి అపాయం ఉండటంతో అన్నదాతలు కర్రలతో మంచెలు నిర్మించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా జనగామ గ్రామానికి చెందిన ఓ రైతు మాత్రం భిన్నంగా ఆలోచించారు. తన పొలంలో పెరిగిన భారీ వృక్షం నీడతో మొక్కలు ఎదగడం లేదు. చెట్టును మొత్తం కొట్టేయడం ఇష్టం లేక కేవలం కొమ్మలు మాత్రమే తొలగించారు. అనంతరం ఆ మోడుపైనే మంచె నిర్మించారు. దీనిపై నుంచి పొలం మొత్తం చూడటంతోపాటు విషకీటకాల నుంచి రక్షణ పొందుతున్నారు.

- న్యూస్‌టుడే, బీబీపేట


మండలానికి ఒకే ఒక్కటి.. కనిపించలేదెవ్వరి కంటికి

భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ప్రముఖుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌. ఆయన చరిత్ర, సాహసాలు అందరికి తెలిసినవే. ఆదివారం ఆయన జయంతి. జిల్లావ్యాప్తంగా ఆయా పక్షాల ఆధ్వర్యంలో ఆయనకు నివాళులర్పించారు. ఒక్క బీబీపేట మండలంలో తప్ఫ ఈ మండలవ్యాప్తంగా జనగామ గ్రామంలో మాత్రమే ఆయన విగ్రహం ఉంది. కానీ ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు ఎవరూ పట్టించుకోలేదు. శుభ్రం చేయడం అటుంచితే కనీసం ఓ పూలమాల వేసే వారు కరవయ్యారు.

- న్యూస్‌టుడే, బీబీపేట


మొక్కలెక్కడా..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రతి గ్రామ శివారులో మొక్కలు నాటించింది. వాటిని సంరక్షించి చెట్లుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించేలా కృషి చేయాలని ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా గ్రామ శివారులో మొక్కలు నాటి రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి. రాజంపేట, బస్వన్నపల్లి, శివాయిపల్లి, ఎల్లారెడ్డిపల్లి, కొండాపూర్‌, గుండారం, అర్గొండ గ్రామ శివారులో ఎక్కడా కనిపించడం లేదు. పిచ్చి మొక్కలు, పొదలు తప్ప మరేమీ లేవు. నాటినవి ఏమయ్యాయో అధికారులకే తెలియాలి. ఇప్పటికైనా స్పందించి కొత్త మొక్కలు నాటి సరరక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, రాజంపేట  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని