logo

దర్శనీయ స్థలాల నెలవు.. ఇందూరు

ఉమ్మడి జిల్లాలో సందర్శనీయ స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆహ్లాదంగా గడిపే ప్రాంతాలు, ఎత్తైన కొండలు,  జల సవ్వడుల ప్రాజెక్టులకు కొదువ లేదు. కానీ, పర్యాటకంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయాయి.

Updated : 25 Jan 2022 03:19 IST

పట్టింపులేక అభివృద్ధికి దూరంగా..

నేడు జాతీయ పర్యాటక దినోత్సవం

ఉమ్మడి జిల్లాలో సందర్శనీయ స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆహ్లాదంగా గడిపే ప్రాంతాలు, ఎత్తైన కొండలు,  జల సవ్వడుల ప్రాజెక్టులకు కొదువ లేదు. కానీ, పర్యాటకంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయాయి. నిధులు కేటాయించి వీటిని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారిస్తే.. బొగత, కుంటాల, లక్నవరం, రామప్ప, వేయిస్తంభాల గుడి, నాగార్జునసాగర్‌ వంటి చారిత్రక ప్రదేశాలకు ఏమాత్రం తీసిసోవు.

సిద్ధుల గుట్ట.. ఎంతో ప్రత్యేకం

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నవనాథ సిద్ధులగుట్ట, భీమ్‌గల్‌ లింబాద్రి గుట్ట, బడా పహాడ్‌ తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలు ప్రకృతి అందాలకు నెలవైన ప్రదేశాలు. వీటిని దర్శించేందుకు పండుగల సందర్భంగా వేలల్లో భక్తులు వస్తుంటారు. సాధారణ సమయాల్లోనూ సందర్శకులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటారు. సిద్ధులగుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రూ.8 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో గుట్టపైకి ఘాట్‌ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇది వరకే నిర్మించిన పిల్లల పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్ది, ప్రకృతి అందాలను తిలకించేందుకు వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. పట్టణ సొగసును తమ చిత్రాల్లో బంధించేందుకు ఫొటో షూట్‌ల పేరుతో కొత్త జంటలు, యూట్యూబర్లు, సినీ దర్శక, నిర్మాతలు వస్తున్నారు. భీమ్‌గల్‌లో లింబాద్రి గుట్టపై నిర్వహించే రథోత్సవాన్ని తిలకించేందుకు లక్షల మంది భక్తులు వస్తుంటారు. విశాలమైన స్థలం ఉంటుంది. ఇక్కడ 50 ఎకరాల్లో పార్కు, పర్యాటకులు బస చేసేందుకు కాటేజీలు నిర్మించొచ్చు. ఇక్కడ దట్టమైన అటవీప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వసతులు కల్పిస్తే పర్యాటకులు మరింత మంది వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గుట్టపైకి రోడ్డు విస్తరణ పనులు  పూర్తయ్యాయి.

సారంగపూర్‌ హనుమాన్‌ దేవాలయం

బోటింగ్‌ కేంద్రాలు..

ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టులున్నాయి. గతంలో నిజాంసాగర్‌లో బోటింగ్‌ సదుపాయం ఉన్నా.. కొన్నిరోజులకే సేవలను ఎత్తేశారు. అలీసాగర్‌, అశోక్‌ సాగర్‌లో బోటింగ్‌ సౌకర్యం ఉంది. రూర్బన్‌ పథకం కింద అలీసాగర్‌లో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు, మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఎస్సీరెస్పీకి వచ్చే పర్యాటకుల కోసం పార్కు మాత్రమే ఉంది. బోటింగ్‌ సదుపాయం లేదు. ఇక్కడ వసతులు కల్పిస్తే ఏడాదంతా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. నిజామాబాద్‌నగరంలో రఘునాథ ఆలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, సిర్నాపల్లి జానకీబాయి చెరువు, రాళ్లవాగు, సారంగపూర్‌ హనుమాన్‌ మందిరం, కౌలాస్‌ కోట, పోచారం ప్రాజెక్టు, దోమకొండ కోట పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అయితే ఇక్కడ చొప్పుకోదగ్గ వసతులు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని