logo

అర్హత వస్తే నిర్ణేతలే

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరి పాలన కావాలో నిర్ణయించుకునే అధికారాన్ని ఓటు హక్కు కల్పిస్తోంది. దాన్ని పొందడానికి గతంలో ఉన్న మూస విధానాలకు ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. ప్రజల వద్దకే పాలన

Updated : 25 Jan 2022 03:18 IST

నేడు జాతీయ ఓటరు దినోత్సవం

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరి పాలన కావాలో నిర్ణయించుకునే అధికారాన్ని ఓటు హక్కు కల్పిస్తోంది. దాన్ని పొందడానికి గతంలో ఉన్న మూస విధానాలకు ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. ప్రజల వద్దకే పాలన అన్నట్లు వారే తమ హక్కును నిర్ధారించుకునే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. సమాచార సాంకేతిక విప్లవాన్ని అన్వయించుకుని యాప్‌లు, వెబ్‌సైట్‌ ద్వారా ఓటు నమోదుకు శ్రీకారం చుడుతోంది. వీటిపైనా ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపించడం చైతన్యలేమికి అద్దం పడుతోంది. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈసీ ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు తీరుపై కథనం..

అరచేతిలో  నిక్షిప్తం

అభిమాన నాయకుడిని ఎన్నుకొనేందుకు ఓటు హక్కు దోహదం చేస్తోంది. అంతటి విలువైన హక్కు పొందడానికి గతంలో ఎంతో కష్టమయ్యేది. చివరికి ఓటేసే రోజు జాబితాలో పేరు లేక నానా అవస్థలు పడ్డారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం పలు సదుపాయాలు కల్పించింది. voterhelpline యాప్‌, voterportaleci.gov.in, nvsp.in అనే వెబ్‌సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారులు ఓటరును ధ్రువీకరించడానికి గరుడ యాప్‌ను ప్రవేశపెట్టారు. స్మార్ట్‌యుగంలో అందరి చేతిలో చరవాణి ఉంది. ఈ అప్లికేషన్ల ద్వారా వివరాలు నమోదు చేసుకోవడం, పేర్లు సరిచూసుకోవడం, పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం, తప్పులు సవరించుకోవడం వంటివి స్వయంగా చేసుకోవచ్చు. అధికారులే ఇంటికొచ్చి వివరాలు సరిచూసుకుని ఓటుహక్కును ధ్రువీకరిస్తారు.

సద్విమర్శగా భావిస్తే..  భావిస్తే..

ప్రతి ఎన్నికల సమయంలో జాబితాలో తమ పేర్లు లేవని, తప్పులున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తాయి. అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తారు. వీటిని సద్విమర్శగా భావించి ఎన్నికల అనంతరం వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సవరిస్తే మేలు జరగనుంది. అందుకు కొప్పర్గ బీఎల్‌వో అనిత పాటించిన తీరును అన్వయించుకోవాలి. ఈసీ నిర్దేశించిన గడువులో బూత్‌స్థాయిలో సవరణలు చేసి దోష రహితంగా జాబితా రూపొందించాలి. ప్రజలు ఎన్నికల సమయంలోనే కాకుండా ఈసీ ప్రకటించిన షెడ్యూలు సమయంలో తమ పేర్లు సరిచూసుకోవడంపై దృష్టి సారించాలి. వందలాది ఓటర్ల వివరాలను క్రోడీకరించే సమయంలో తప్పులు దొర్లడం సహజం. ఈ విషయంలో అధికారులను ఎంతగా బాధ్యులను చేస్తామో అంతే నిబద్ధత ఓటరుపైనా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.

30-39 వయసు ఓటర్లే కీలకం

యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్‌కు పేరుంది. అందుకు తగ్గట్లే పనిచేసే శక్తి ఉన్నవారి సంఖ్య అధికమని ఉభయ జిల్లాల ఓటరు జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. నమోదైన ఓటరు జాబితాలో 30-39 వయసున్న వారే అధికంగా ఉన్నారు. ఆ తర్వాత 20-29 ఏళ్ల వారు ఎక్కువ. అంటే దాదాపుగా సగం ఓటర్లు యువతేనన్నది గుర్తెరగాలి. ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. అదే విధంగా ఉభయ జిల్లాలోనూ మహిళా ఓటర్లే అధికం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని