logo

అక్రమ లేఅవుట్లు.. కొనుగోలుదారుల పాట్లు

జిల్లాకేంద్రంలోని న్యాల్‌కల్‌ రోడ్డులోని ఆర్టీసీ డిపో దాటిన తర్వాత మూడెకరాల్లో లేఅవుట్‌ లేకుండా ప్లాట్లు చేశారు. డీటీసీపీ అనుమతి కోసం దరఖాస్తు చేశామని.. త్వరలోనే వస్తోందని నమ్మించారు. గజం రూ.8,500

Updated : 25 Jan 2022 03:14 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

నిజామాబాద్‌ న్యాల్‌కల్‌ రోడ్డులో అనుమతి లేని వెంచర్‌

జిల్లాకేంద్రంలోని న్యాల్‌కల్‌ రోడ్డులోని ఆర్టీసీ డిపో దాటిన తర్వాత మూడెకరాల్లో లేఅవుట్‌ లేకుండా ప్లాట్లు చేశారు. డీటీసీపీ అనుమతి కోసం దరఖాస్తు చేశామని.. త్వరలోనే వస్తోందని నమ్మించారు. గజం రూ.8,500 చొప్పున విక్రయించడంతో సుమారు 20 మంది వరకు ప్లాట్లు కొనుగోలు చేశారు. నెలలు గడుస్తున్నా డీటీసీపీ అనుమతి రాలేదు. లేఅవుట్‌ లేని కారణంగా రిజిస్ట్రేషన్‌ కావట్లేదు. స్థలం కొన్నవారు రియల్టర్ల చుట్టు తిరుగుతున్నారు.

నగరంతో పాటు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లు ఎక్కువగా వెలుస్తున్నాయి. పరిధి విస్తరిస్తుండటంతో పొలాలను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. అనుమతి లేకుండా ఏర్పాటైన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దని అధికారులు చెబుతున్నా ఎవరూ వినిపించుకోవట్లేదు. రోజురోజుకు భూమి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ధరకు కొనాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. బయట మార్కెట్‌ కంటే తక్కువ ధర ఉండడంతో గిరాకీ బాగానే ఉంది.

పది శాతం భూమి ఇవ్వాలి

లేఅవుట్‌ ప్రకారం వెంచర్‌ ఏర్పాటు చేస్తే వాటిలో అన్ని సౌకర్యాలు కల్పించాలి. రహదారులు, వీధి దీపాలు, కల్వర్టులు ఉండాలి. నిబంధనల ప్రకారం ప్లాట్లు చేయాలి. వెంచర్‌లో పది శాతం భూమిని నగర పాలక సంస్థకు ఇవ్వాలి. అందులో ఉద్యానాన్ని ఏర్పాటు చేస్తారు.

మరికొన్ని..

* న్యాల్‌కల్‌ రోడ్డులో రెండెకరాల్లో నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లు ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో మరో మూడెకరాల్లో వ్యవసాయ భూమిని ప్లాట్లు చేసి విక్రయానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే డీటీసీపీ అనుమతిస్తుందని చెబుతున్నారు.

* బోర్గాం(పి)లో రెండు వెంచర్లు అనుమతి లేకుండా ఉన్నాయి. నగరానికి సమీపంలో ఉండడంతో వచ్చే రోజుల్లో భూమి ధర పెరుగుతుందనే ఉద్దేశంతో ప్లాట్లు అమ్ముతున్నారు.

అర్సపల్లి, మాలపల్లి, సారంగపూర్‌, గూపన్‌పల్లి, నుడా పరిధిలోని పలు గ్రామాల్లో నాన్‌ లేఅవుట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. రియల్టర్లకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బల్దియాకు నష్టం

నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లు వెలియడంతో నగర పాలక సంస్థ ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. అనుమతుల మేరకు ప్లాట్లు ఏర్పాటు చేస్తే ఎకరానికి సుమారు రూ.4 లక్షల ఫీజు చెల్లించాలి. లేఅవుట్‌ చేసిన స్థలాన్ని కొనుగోలు చేస్తే భవన నిర్మాణ సమయంలోనూ అనుమతి పేరిట మున్సిపల్‌కు ఆదాయం రానుంది.

కొనుగోలు చేయొద్దు - వికాస్‌, డిప్యూటి సిటీ ప్లానర్‌(డీసీపీ), నగర పాలక సంస్థ

అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దు. లేఅవుట్‌ చేసినవి కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ కావడంతో పాటు భవన నిర్మాణానికి అనుమతి వస్తోంది. ప్రజలు ఈ విషయన్ని గమనించాలి.
నిజామాబాద్‌ న్యాల్‌కల్‌ రోడ్డులో అనుమతి లేని వెంచర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని