logo

నారీమణులకు జనరిక్‌ దుకాణాలు

తక్కువ ధరకే పేద ప్రజలకు జనరిక్‌ ఔషధాలు అందించి వైద్య ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఔషధి పథకం ద్వారా దేశంలో పలుచోట్ల ఈ మందుల దుకాణాలు ఏర్పాటు చేశారు.

Published : 25 Jan 2022 03:12 IST

స్త్రీనిధి ద్వారా రుణ సదుపాయం

డిచ్‌పల్లిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జనరిక్‌ ఔషధి మందుల దుకాణం

న్యూస్‌టుడే, బీర్కూర్‌ : తక్కువ ధరకే పేద ప్రజలకు జనరిక్‌ ఔషధాలు అందించి వైద్య ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఔషధి పథకం ద్వారా దేశంలో పలుచోట్ల ఈ మందుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు మందుల ఖర్చులు తగ్గించేందుకు స్త్రీనిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్‌ మందుల దుకాణాలు ఏర్పాటు చేయించేందుకు రుణాలు అందిస్తోంది. ఇప్పటికే ఐకేపీ, మెప్మా అధికారులు గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకొంటున్నారు.

విధి విధానాలు

స్వయం సహాయక సంఘంలో సభ్యురాలై ఉండాలి. సభ్యురాలి కుమార్తె, కొడుకు, వీరి బంధువులు డీఫార్మసీ, బీఫార్మాసీ, ఎంఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

తొలుత సంఘం, గ్రామ సంఘాల తీర్మానం పత్రం తీసుకోవాలి. సభ్యురాలి ఆధార్‌కార్డు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా ధ్రువీకరించిన అనుమతి పత్రం, కొటేషన్‌, దరఖాస్తుదారు విద్యార్హత పత్రాలు జతచేసి మండల కేంద్రాల్లో ఐకేపీ, పట్టణాల్లో మెప్మా, స్త్రీనిధి అధికారులకు అందజేయాలి. వారు దరఖాస్తుదారుల వివరాలను స్త్రీనిధి వెబ్‌సైట్లో నమోదు చేస్తారు

జనరిక్‌ మందుల దుకాణం ఏర్పాటుకు సభ్యురాలికి యూనిట్‌ కింద రూ.3 లక్షల రుణం అందజేస్తారు. ఇందులో ఎలాంటి రాయితీ ఉండదు. మంజూరైన రుణం గ్రామ సంఘం ఖాతాల్లో నుంచి సభ్యురాలి వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తారు. ఈ దుకాణాన్ని సొంత లేదా అద్దె 120 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి.

* మొత్తం రుణం రూ.3,09,450. ఇందులో సభ్యురాలు ఐదేళ్ల వరకు రూ.3450 స్త్రీనిధి ద్వారా బీమా ప్రీమియం చెల్లిస్తారు. లోన్‌ లింక్‌డ్‌ షేర్‌ క్యాపిటల్‌ కింద రూ.6 వేలు చెల్లిస్తారు. సభ్యురాలి చేతికి రూ.3 లక్షల రుణం మాత్రమే వస్తుంది.

* తీసుకున్న రుణాన్ని ప్రతినెల రూ.6728 కిస్తీగా చెల్లించాలి. 60 నెలల వాయిదాలో చెల్లించాలి.

దరఖాస్తు చేసుకోవాలి

డ్వాక్రా సంఘాల్లో అర్హులైన మహిళల పిల్లలు జనరిక్‌ మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకొనేందుకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి. పేద ప్రజలకు బ్రాడెండ్‌ మందులతో సమానంగా పని చేసే జనరిక్‌ మందులను తక్కవ ధరకు అందించడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేయిస్తున్నాం.

- రవికుమార్‌,  స్త్రీనిధి జోనల్‌ మేనేజర్‌, కామారెడ్డి జిల్లా

కామారెడ్డి జిల్లాలో ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలు 21,176 ఉండగా 2,17,593 మంది సభ్యులున్నారు.

* ఉమ్మడి జిల్లాలో జనరిక్‌ ఔషధి మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆరు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలు 34,973 ఉండగా, 3,73,437 మంది సభ్యులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని