Dharmapuri Arvind: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వాహనంపై తెరాస శ్రేణుల దాడి.. ఉద్రిక్తత

భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వాహనంపై తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. నిజామాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా

Updated : 25 Jan 2022 17:00 IST

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లాలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వాహనంపై తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. నందిపేట్‌ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అర్వింద్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో భాజపా, తెరాస శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్‌లో భాజపా నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు: అర్వింద్‌

నందిపేట్‌ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారని ధర్మపురి అర్వింద్‌ చెప్పారు. సుమారు 200 మంది ఆ పార్టీ కార్యకర్తలు తమకు అడ్డు తగిలారని.. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వేశారని ఆరోపించారు. ఈ విషయంపై సీపీ, ఏసీపీలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. పోలీసులే దగ్గరుండి తమ వాహనాలపై దాడి చేయించారని అర్వింద్‌ ఆరోపించారు. పోలీసులు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తాము పదేపదే చెబుతున్నామని.. ఈరోజు అది రుజువైందన్నారు. ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని.. తమ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

మరోవైపు తెరాస కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని ఆరోపిస్తూ పోలీస్‌ కమిషనర్‌కు ధర్మపురి అర్వింద్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని