logo

విధుల్లో నిర్లక్ష్యం

నిజామాబాద్‌ నగరం చంద్రశేఖర్‌ కాలనీలో ఓ మహిళా సంఘం సభ్యులకు రుణాలు ఇప్పించడంతో పాటు వారికి సంబంధించిన కార్యకలాపాలను ఆర్పీ నమోదు చేయట్లేదు. ఆ ప్రాంతం సీవోనే అన్నీ తానై

Published : 27 Jan 2022 05:05 IST

ఆర్పీల పనితీరుపై అనుమానాలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

మెప్మా కార్యాలయం

నిజామాబాద్‌ నగరం చంద్రశేఖర్‌ కాలనీలో ఓ మహిళా సంఘం సభ్యులకు రుణాలు ఇప్పించడంతో పాటు వారికి సంబంధించిన కార్యకలాపాలను ఆర్పీ నమోదు చేయట్లేదు. ఆ ప్రాంతం సీవోనే అన్నీ తానై చేస్తున్నారు.

కొవిడ్‌ కట్టడి నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేస్తున్నారు. ఇందులో ఆర్పీలకు కూడా విధులు కేటాయించారు. కానీ ఓ డివిజన్‌లో ముగ్గురు ఆర్పీలు విధులకు రాకుండా వారికి సంబంధించిన మనుషులను పంపించడం చర్చనీయాంశమైంది.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఎందరు రిసోర్స్‌ పర్సన్లు(ఆర్పీ)లు ఉన్నారు? వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. సంఘాలకు రుణాలు ఇప్పించడంలో వారిదే కీలకపాత్ర. అలాంటిది నగరంలో వారు పని చేయకున్నా చేస్తున్నట్లుగా సీవోలు చెబుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండట్లేదు.

కాగితాలకే పరిమితం

నగరంలో 5,800 స్వయం సహాయక సంఘాలు ఉండగా 212 మంది ఆర్పీలు పని చేస్తున్నట్లు మెప్మా అధికారులు చెబుతున్నారు. 200కుపైగా మహిళా సమాఖ్యలు ఉన్నాయి. ఆర్పీల పేర్లు కేవలం కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. కొందరూ ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇటీవల ఓ ఆర్పీ ఏదో పని నిమిత్తం మెప్మా కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మహిళా సంఘాల పనితీరును పర్యవేక్షించే కీలక ఉద్యోగి ‘నేనెవరో తెలుసా’ అని అడిగారు. దీంతో ఆర్పీ తెలియదని సమాధానం ఇచ్చారు. ఈ ఒక్క ఉదాహరణతో ఆర్పీల పనితీరు ఎలా ఉందో తెలిసిపోతుంది. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తమకు సంబంధించిన వారిని ఆర్పీలుగా నియమించుకునే హక్కు ఉంది. వారికి నెలకు గౌరవ వేతనం రూ.4 వేలు ఉండగా సమాఖ్య వారు రూ.2 వేలు ఇవ్వాల్సి ఉంటుంది.

తెలుసుకొని.. సరి చేస్తాం

- రాములు, పథక సంచాలకులు, మెప్మా

ఆర్పీలు సరిగా పనిచేసేలా త్వరలోనే ప్రణాళిక రూపొందిస్తాను. సీవోల వారీగా సమావేశాలు పెడతాం. వారు ఎప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారో తెలుసుకుంటాను. సమాఖ్యల సమావేశానికి ఆర్పీలు రావట్లేదని తెలుస్తోంది. తాజాగా ఆర్పీలకు 11 నెలలకు సంబంధించిన వేతనాలు ఇచ్చాం.


సీవోల ఇష్టారాజ్యం

మెప్మాలో సీవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో ఏడుగురు సీవోల పరిధిలో ఆర్పీలు ఉంటారు. వారు రోజూ ఎక్కడికెళ్తున్నారు? ఏం పని చేస్తున్నారని చూడాలి. నెలరోజుల నివేదిక ఆధారం వేతనం ఇవ్వాలి. అయితే విధులకు హాజరుకాకున్నా వేతనం మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పాలక సంస్థలో తొమ్మిది గ్రామాలు విలీనం కాగా వాటిలో ఆర్పీల నియామకంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఏదైనా సందర్భంలో సమావేశం నిర్వహించినా కనీసం 50 మంది కూడా రావట్లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు