logo

ఇందూరు గడ్డపై.. పద్మజారెడ్డి నాట్యస్ఫూర్తి

అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి చిన్న కోడలు, డాక్టర్‌ జి.పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కాకతీయం అనే సరికొత్త

Updated : 27 Jan 2022 05:05 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

ఇందూరు ఉత్సవాల్లో పద్మజారెడ్డి నృత్య ప్రదర్శన

అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి చిన్న కోడలు, డాక్టర్‌ జి.పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కాకతీయం అనే సరికొత్త నృత్యరూపకాన్ని ఆవిష్కరించారు. ఆమె స్ఫూర్తితో జిల్లాకు చెందిన పలువురు కళాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాట్యప్రదర్శనలు ఇచ్చి కీర్తిని ఇనుముడింపజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఇందూరుతో నాట్య అనుబంధంపై కథనం.

ఇందూరు ఉత్సవాల్లో..

2003లో అప్పటి కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో మొదటిసారిగా వారం రోజుల పాటు ఇందూరు ఉత్సవాలు నిర్వహించారు. పద్మజారెడ్డి నిజామాబాద్‌ కలెక్టరేట్‌ మైదానంలో నాట్యప్రదర్శన ఇచ్చారు. 2004లో రెండోసారి ఇందూరు ఉత్సవాల వేదికపై నర్తించారు. తర్వాత 2007లో నిజామాబాద్‌ శతాబ్ది ఉత్సవాల్లో మరోసారి ఇదే వేదికపై నృత్యరూపకం ప్రదర్శించారు. 2010లో చారిత్రక ఖిల్లా రఘునాథాలయ ప్రాంగణంలో గుడి నృత్యం పేరుతో ప్రత్యేక రూపకాన్ని ఆవిష్కరించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వేల ప్రదర్శనలు ఇచ్చి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వీరి బృందంలో జిల్లాకు చెందిన యువ కళాకారిణి శ్రీదేవి పాల్గొన్నారు. అమెరికాలోని అట్లాంటాలో 2012లో జరిగిన ‘నమస్తే ఇండియా’ నృత్యరూపకంలో నర్తించారు. కూచిపూడి నాట్యాచార్యుడు ప్రశాంత్‌కుమార్‌ తన శిష్యులను పద్మజారెడ్డి నుంచి ప్రేరణ పొందేలా తీర్చిదిద్దారు.


మోహినీ అట్టం..

- యువ కళాకారిణి శ్రీదేవి(అమెరికా నుంచి)

నేను చిన్నప్పటి నుంచి శాస్త్రీయనృత్యంలో శిక్షణ పొంది రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలు ఇచ్ఛా తర్వాత పెళ్లి కావడంతో మొదట లండన్‌కు, తర్వాత అమెరికా వచ్చాను. అంతకుముందు ప్రముఖ నాట్యకారిణి పద్మజారెడ్డి బృందంలో సభ్యురాలిని. 2012లో అమెరికా అట్లాంటాలో జరిగిన ఆటా ఉత్సవాల వేదికపై మేడంతో కలిసి నేను మోహినీఅట్టం నాట్యం చేశా. ఎప్పటికీ మరిచిపోలేని ప్రదర్శన అది. ఆమెకు పద్మశ్రీ పురస్కారం రావడం సంతోషంగా ఉంది.


బాలభవన్‌ చిన్నారులకు..

- ప్రశాంత్‌కుమార్‌, నాట్యాచార్యులు

నాట్యకళపై పద్మజారెడ్డికి ఉన్న ఆసక్తి ఎందరికో స్ఫూర్తినిస్తుంది. నాట్య ప్రదర్శనలో వారి ప్రయోగాలు నాకు ఎంతో ఇష్టం. అవి చూసి నేనూ పలు నృత్య రూపకాల్లో వైవిధ్యంగా రూపొందించా. ఆమె గతంలో జిల్లా బాలభవన్‌ చిన్నారుల ప్రదర్శనలకు అవసరమైన ఆభరణాలు, దుస్తుల కోసం ఆర్థిక సాయం అందించారు. మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఇందూరు కళాకారులు కోరుకుంటున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని