logo

మొక్కజొన్న కుప్పలు దగ్ధం

ప్రమాదవశాత్తు మొక్కజొన్న కుప్పలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని తుమ్మల్ల శివారులో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట వ్యర్థాలకు గుర్తు

Published : 27 Jan 2022 05:05 IST

కాలిపోయిన మక్క కంకులు

గాంధారి, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు మొక్కజొన్న కుప్పలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని తుమ్మల్ల శివారులో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా గాలి వీయడంతో పక్కనే ఉన్న ఎండ్రియాల్‌ కిష్టయ్య ఎకరం విస్తీర్ణంలో పండిన మొక్కజొన్న కుప్పలు(దూడులు) మంగళవారం రాత్రి కాలిపోయాయి. రెవెన్యూ సిబ్బంది బాలయ్య పంచనామా నిర్వహించి రూ.60 వేల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.


బెల్టు దుకాణాలపై ఆబ్కారీ అధికారుల దాడి

లింగంపేట, న్యూస్‌టుడే: శట్పల్లి, మెంగారం గ్రామాల్లో బెల్టు దుకాణాలపై బుధవారం ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. శట్పల్లిలో రామాగౌడ్‌, శివకుమార్‌, మెంగారంలో బాలాగౌడ్‌ అక్రమంగా బెల్టు దుకాణాలు నిర్వహిస్తుండడంతో సోదాలు నిర్వహించి 16 లీటర్ల మద్యం సీజ్‌ చేసినట్లు అబ్కారీ సీఐ రాధాకృష్ణారెడ్డి తెలిపారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


బాల కార్మికుడికి విముక్తి కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో భవన నిర్మాణ పనిలో పనిచేస్తున్న ఓ బాలకార్మికుడికి పట్టణ సీఐ నరేష్‌ ఆధ్వర్యంలోని పోలీసులు బుధవారం విముక్తి కల్పించారు. కొమురయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఆలయంలో చోరీ రాజంపేట, న్యూస్‌టుడే: పొందుర్తి పెద్దమ్మ ఆలయంలోకి మంగళవారం రాత్రి దుండగులు చొరబడి హుండీలోని నగదు ఎత్తుకెళ్లినట్లు రాజంపేట ఎస్సై రాజు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 20 రోజుల క్రితం ఇదే గ్రామంలోని రెండిళ్లలో దొంగతనాలు జరిగాయి.

మొరం ట్రాక్టర్ల పట్టివేత ఎల్లారెడ్డి పురపాలిక, న్యూస్‌టుడే: పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా అక్రమంగా తరలిస్తున్న మూడు మొరం ట్రాక్టర్లను పట్టుకొని కార్యాలయానికి తరలించినట్లు ఆర్‌ఐ మహ్మద్‌ తెలిపారు. వాల్టా చట్టం కింద కేసు నమోదు చేసి జరిమానా విధించనున్నట్లు చెప్పారు.


ఎనిమిది చరవాణులు ఎత్తుకెళ్లిన దుండగులు

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండ మండలం లింగుపల్లి శివారులో మంగళవారం రాత్రి కార్మికుల స్థావరాల్లోకి వచ్చిన దుండగులు ఎనిమిది మంది చరవాణులు ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా కంగ్తి ప్రాంతానికి చెందిన కార్మికులు ఇక్కడ చెరకు కోత పనులకు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు బాధితులు దోమకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు.


పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

మాస్కులు ధరించని 40 మందిపై కేసులు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణ సీఐ నరేష్‌ ఆధ్వర్యంలోని పోలీసులు బుధవారం రాత్రి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 40 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని