logo

ప్రైవేటులోనే ప్రసవాలు

ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఓ గ్రామంలో జ్వర సర్వే తీరును పరిశీలిస్తే ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం గతేడాది నివేదిక చూపారు. ఆర్మూర్‌లో టీకాల లక్ష్యం గురించి అడిగితే అరకొర సమాధానాలు చెప్పారు.

Published : 28 Jan 2022 03:23 IST

సర్కారు దవాఖానాల్లో తగ్గుదల

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఓ గ్రామంలో జ్వర సర్వే తీరును పరిశీలిస్తే ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం గతేడాది నివేదిక చూపారు. ఆర్మూర్‌లో టీకాల లక్ష్యం గురించి అడిగితే అరకొర సమాధానాలు చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందనడానికి ఇదే నిదర్శనం. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై అధికారులు పట్టించుకోవడం లేదు.

* కొవిడ్‌ కట్టడి, జ్వరసర్వే, టీకాలపై 24 గంటలు పనిచేస్తున్నామంటూ చెబుతున్న అధికారులు సర్కారు దవాఖానాల్లో ప్రసవాల గురించి సమీక్షలు నిర్వహించట్లేదు. ఫలితంగా ప్రైవేటులో ప్రసవాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులోనూ శస్త్రచికిత్సలు చేసి పేదలను దోచుకుంటున్నారు.

గతంలో ఇలా..

గతంలో పనిచేసిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ప్రభుత్వ వైద్యాశాలల్లో ప్రసవాలు పెంచేందుకు దృష్టి సారించారు. దానికి తోడు కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టడం కలిసొచ్చింది. ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ నడిపిస్తూ హైరిస్క్‌ కేసులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. రక్తహీనత ఉన్నవారిని ముందుగా గుర్తించి దవాఖానాకు వచ్చేలోగా రక్తం సిద్ధం చేసేవారు. జిల్లాలోని దాదాపు సగం పీహెచ్‌సీల్లో శస్త్రచికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పేదలు ప్రైవేటుకు వెళ్లకుండా, అప్పుల పాలు కాకుండా చూశారు. ఒక దశలో ఆయన్ని బదిలీ చేసేందుకు కొందరు ప్రైవేటు వైద్యులు ప్రయత్నించిన విషయం చర్చనీయాంశమైంది.

కొవిడ్‌ పేరుతో...

సాధారణంగా ప్రసవానికి వెళ్తే సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ప్యాకేజీ పేరుతో వసూలు చేస్తున్నారు. కొవిడ్‌ వచ్చిన గర్భిణులను పంపిస్తే కేసుకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఏజెంట్లకు ఆఫర్‌ చేస్తున్నట్లు సమాచారం. అలాంటి వారి దగ్గర రూ.లక్ష ప్యాకేజీ తీసుకుంటున్నారు. ప్రైవేటులో సాధారణ ప్రసవమయ్యే అవకాశం ఉన్నా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు సమాచారం.

గ్రామాల్లో ఏజెంట్లు

ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ మూలకు చేరాయి. పీహెచ్‌సీల్లో డీజీవోలు, మత్తు వైద్యులు లేరని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. కేవలం సాధారణ ప్రసవాలకే పరిమితం చేశారు. ఇదే అదునుగా భావించిన పలు ప్రైవేటు ఆసుపత్రులకు చెందినవారు గ్రామస్థాయిలో కొందరు ఆశా కార్యకర్తలను, ఏఎన్‌ఎంలను ఏజెంట్లుగా నియమించుకున్నారు. కాన్పులకు ఆసుపత్రికి పంపించిన వారికి రూ.3000 నుంచి రూ.4000 అందజేస్తున్నారు. జిల్లా ఆసుపత్రికి వచ్చిన వారిని కూడా పలువురు స్థానిక సిబ్బంది ఏదో ఒకటి చెప్పి ప్రైవేటుకు వెళ్లేలా చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మత్తు వైద్యుల కొరత ఉంది

వైద్యఆరోగ్యశాఖ పరిధిలో స్త్రీవైద్యనిపుణులు, మత్తు వైద్యుల కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. శస్త్రచికిత్స అవసరమైతే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి పంపిస్తున్నాం.

- సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని