logo

లక్షణాలు ఉంటేనే పరీక్ష చేయించుకోవాలి

20 రోజుల క్రితం కొవిడ్‌ వచ్చి తగ్గింది. బీపీ, మధుమేహం ఉంది. ఇప్పటికీ దగ్గు తగ్గడం లేదు తెమడతో వస్తోంది. - బాలదుర్గయ్య, గౌతంనగర్‌

Updated : 28 Jan 2022 04:05 IST

అనవసరంగా మాత్రలు వాడొద్దు

‘న్యూస్‌టుడే’ఫోన్‌ఇన్‌లో డాక్టర్‌ ఉదయ్‌కృష్ణ

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

ఈనాడు ఫోన్‌ఇన్‌ కార్యాక్రమంలో సమస్యలకు సమాధానాలు

ఇస్తున్న శ్వాసకోశ వైద్యనిపుణుడు ఉదయ్‌కృష్ణ

* 20 రోజుల క్రితం కొవిడ్‌ వచ్చి తగ్గింది. బీపీ, మధుమేహం ఉంది. ఇప్పటికీ దగ్గు తగ్గడం లేదు తెమడతో వస్తోంది. - బాలదుర్గయ్య, గౌతంనగర్‌

డాక్టర్‌: వైరస్‌ కారణంగా వచ్చిన దగ్గు రెండు, మూడు వారాల వరకు ఉండే అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. తెమడ తెలుపుగా కాకుండా పసుపు రంగులో వస్తే ఒకసారి వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిది.

* రెండు రోజుల క్రితం జలుబైంది. ముక్కు నుంచి నీరు కారుతూనే ఉంది. జ్వరం లేదు. ఇతర ఎలాంటి లక్షణాలు లేవు. ఇది కొవిడ్‌ అయి ఉంటుందా? - సంతోష్‌, భవానిపేట్‌(కామారెడ్డి)

చలి తీవ్రత వల్ల సైతం జలుబు, ముక్కు నుంచి నీరుకారే అవకాశం ఉంది. మరో రెండు రోజులు చూసి తగ్గకపోతే కొవిడ్‌ పరీక్ష చేయంచుకోండి.

* ప్రతి సంవత్సరం చలికాలంలో దగ్గు, జలుబు వస్తుంది. మిగతా కాలం ఎలాంటి సమస్య ఉండదు. - రాజేశ్వర్‌, ఆర్మూర్‌

చలికాలంలోనే సమస్య వస్తుంది కాబట్టి మీకు ఎలర్జీ ఉంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ముక్కు, నోరు, చెవులకు గాలి తగలకుండా జాగ్రత్తపడండి. ఏ ఆహారం తీసుకుంటే దగ్గు వస్తుందో గమనించి వాటిని తినడం మానేయాలి.

* అర్ధరాత్రి సమయంలో ఉన్నఫలంగా శ్వాస ఆగినట్లు అవుతోంది. ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నాను. నాకు పాన్‌ తినే అలవాటు ఉంది. - గంగాప్రసాద్‌ అప్ప, బోధన్‌

గురక ఎక్కువ రావడం వల్ల ఈ సమస్య వస్తుంది. రాత్రి శ్వాస ఇబ్బంది కలిగినప్పుడు ఒక గ్లాస్‌ నీరు తాగి పడుకోండి. పడుకునే సమయంలో తలభాగం ఎత్తుగా ఉండేలా చూసుకోండి. పడుకునే ముందు వేడినీళ్లతో గార్లింగ్‌ చేయండి. గురక ఎక్కువగా వస్తే వైద్యుడిని సంప్రదించండి.

* అప్పుడప్పుడు జలుబు అవుతుంది. యాంటిబయోటిక్‌ వాడితేనే తగ్గుతుంది. - శంకర్‌, చంద్రశేఖర్‌ కాలనీ

చాలామంది ఏదైనా సమస్య రాగానే యాంటిబయోటిక్‌ మాత్రలు వేసేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల అవసరమైన సమయంలో మందులు పనిచేయకుండా పోతాయి. తరచూ జలుబు ఎందుకవుతుందనే విషయాన్ని మొదట వైద్యుడి వద్దకు వెళ్లి తెలుసుకొంటే పరిష్కారం దొరుకుతుంది.

* గత కొన్నిరోజులుగా శ్వాస లోపలకు తీసుకునే సమయంలో గొంతు వద్ద ఇబ్బందవుతోంది. అప్పుడప్పుడు పొట్ట ఉబ్బుతోంది. దమ్ము వస్తోంది. థైరాయిడ్‌, టీబీ పరీక్షలు చేయించాం. అన్ని బాగానే ఉన్నాయి. - సుధారాణి, కంఠేశ్వర్‌

ఈ సమస్యకు ప్రధాన కారణం ఎసిడిటీ. మీరు మొదట ఆహారపు అలవాట్లు మార్చుకోండి. పరిష్కారానికి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ను సంప్రదించండి. శ్వాస తీసుకోవడంలో ఏర్పడిన ఇబ్బంది పోతుంది.

* మా చెల్లి శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతోంది. - సంపూర్ణ, నిజామాబాద్‌

చలి ఎక్కువగా ఉంది కాబట్టి శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం గడిపే గదిలో దుమ్ముదూలి లేకుండా చూసుకోవాలి. సెల్ఫులపై దుమ్ము పేరుకుపోయి ఫ్యాను వేయగానే పైకిలేచి రాత్రంతా ముక్కులోకి వెళ్లిపోతుంది. ఇది మన కంటికి కనిపించదు. నూనె పదార్థాలు ఎక్కువగా తినకూడదు. ఇంటి కిటికీల్లో పావురాలు లేకుండా చూసుకోవాలి.

* తరచూ పొటాషియం తగ్గుతోంది. అన్నం తింటే అరగడం లేదు. కడుపు మంటగా ఉంటోంది. - గజేందర్‌, కోటగిరి

మీ సమస్య భయపడాల్సింది కాదు. సొంతగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించండి. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది.

* ఐదేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. చలికాలంలో తీవ్రమవుతోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - రాజేంద్రప్రసాద్‌(బోధన్‌), చందు(ఆర్మూర్‌), రఘు(కోటగల్లి)

ఆస్తమా ఉన్నవారు చలికాలంలో వీలైనంత వరకు ఉదయం లేవకపోవడం మంచిది. ఎండ వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలి. చలిలో నడక సాగించడం మంచిదికాదు. చాలా మంది ఎండ వచ్చిందని డాబాపైకెళ్లి నిలబడతారు. ఇది సరికాదు. చెవులు, ముక్కు, నోరు నుంచి చలిగాలి లోపలకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఇన్‌ప్లాంజా(ఫ్లూవ్యాక్సిన్‌) తీసుకుంటే ఊపిరితిత్తులకు రక్షణ కవచంగా ఉంటుంది.

* రెండోదశలో కొవిడ్‌ వచ్చింది. మాస్నేహితుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఫ్యాబిఫిరావిర్‌ మాత్రలు వేసుకున్నాను. ప్రస్తుతం ఆరోగ్యం బాగుండటం లేదు. కారణం ఏమంటారు? - నరేశ్‌(కామారెడ్డి), నాగరాజు(గంగాస్థాన్‌)

చాలా మంది రెండోదశలో ప్రాణభయంతో ఎవరు ఏది చెబితే ఆ మాత్రలు వేసుకున్నారు. యాంటి వైరల్‌ డ్రగ్స్‌ అంటే ఫ్యాబిఫిరావిర్‌, మాల్యూనాఫిరావిర్‌, డాక్సిసైక్లిన్‌, హైవర్‌మెట్రిన్‌ వంటి మాత్రలను డాక్టర్‌ సలహా మేరకే వాడాలి. ఇలాంటి మాత్రలు వాడినవారు, వాడి మధ్యలో ఆపేసినవారు అనారోగ్య సమస్యలతో చాలా మంది నా వద్దకొచ్చారు. ఈ పరిస్థితికి యాంటి వైరల్‌ డ్రగ్స్‌ వాడటమే కారణమని గుర్తించాను. ప్రస్తుతం వారికి అసలు సమస్యకంటే ఇవే ప్రమాదకరంగా మారాయి.

* ఇంట్లో ఒక్కరికి పాజిటివ్‌ వచ్చింది. మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవు. అందరికి పరీక్ష చేయించాలా? - రాజు, సుభాష్‌నగర్‌

ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ వచ్చినవారు సైతం ఏడురోజులు ఐసోలేషన్‌ ఉంటే సరిపోతుంది. మళ్లీ నెగిటివ్‌ వచ్చిందా.. లేదా.. అని పరీక్ష చేయించుకోవద్ధు అనవసరంగా అందరిని పరీక్షలకు తీసుకెళ్లి రోగం అంటించుకోవద్ధు.

* ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోలేదు. కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నా. కొవిడ్‌ వస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా? - రాజన్న(ఆర్మూర్‌), రవి(బాన్సువాడ)

ప్రధానంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు తప్పనిసరిగా రెండు డోసులు వేసుకోవాలి. అందరితో పోల్చితే కొవిడ్‌ వస్తే వీరికే ఎక్కువ ప్రమాదం. 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్‌ డోసు సైతం ఇస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్ఫు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని