logo

దళితబంధు అమలుకు శ్రీకారం

దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం జిల్లాలో అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా ఒక్కో

Published : 28 Jan 2022 03:23 IST

నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం జిల్లాలో అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా ఒక్కో నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 350 మంది(బాన్సువాడ సగం)కి రూ.10 లక్షల వంతున లబ్ధి చేకూరనుంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వచ్చే నెల 5వ తేదీలోపు ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయించారు. తదనంతరం లబ్ధిదారులు నిర్దేశించుకున్న యూనిట్లను మార్చి 7లోపు గ్రౌండింగ్‌ చేయాలని నిర్ణయించారు. మొదట ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది.

ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే...

లబ్ధిదారుల ఎంపికపై పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకే అప్పగించింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ బహిరంగంగా వెల్లడించడం లేదు. గ్రామాల వారీగా దళితుల జనాభాతో పాటు కుటుంబాల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శుల ద్వారా సేకరిస్తున్నారు.

పూర్తయిన మ్యాపింగ్‌

 

పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం దళితబంధు పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవలే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల వివరాలతో పటాలు, పేర్లు మ్యాపింగ్‌ చేశారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారి వివరాలను నమోదు చేయనున్నారు. అర్హులు ఎంపిక చేసుకునేందుకు అవసరమైన యూనిట్ల సమాచార సేకరణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ముఖ్యంగా ఒకేరకమైన యూనిట్లు లేకుండా పోర్టల్‌ను తీసుకొచ్చారు.

పారదర్శకంగా..

పథకాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అమలు చేసేందుకు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఒక్కో నియోజకవర్గానికి జిల్లాస్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించారు. లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో పాటు యూనిట్ల ఎంపికకు అవసరమైన దిశానిర్దేశం చేయనున్నారు. తదనంతరం గ్రౌండింగ్‌ చేయించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటు అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని