logo

దస్త్రం లేని.. భూకొలతలు

జిల్లా ఏర్పడి ఐదేళ్లయినా భూ కొలతల శాఖలో దస్త్రాల విభజన పూర్తికాలేదు. హద్దులు తేల్చేందుకు సర్వేయర్లు వినియోగించే కీలకమైన నిజాంకాలం నాటి టిప్పన్లు అందుబాటులో లేకపోవడం సమస్యగా

Published : 28 Jan 2022 03:23 IST

ఆరేళ్లయినా జిల్లాకు చేరని వైనం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

చినిగిన పత్రాలు(పాతచిత్రం)

జిల్లా ఏర్పడి ఐదేళ్లయినా భూ కొలతల శాఖలో దస్త్రాల విభజన పూర్తికాలేదు. హద్దులు తేల్చేందుకు సర్వేయర్లు వినియోగించే కీలకమైన నిజాంకాలం నాటి టిప్పన్లు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో కామారెడ్డికి సంబంధించిన వీటిని భద్రపరచడం అక్కడి అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. దీనికి తోడు జిల్లాలోని 72 గ్రామాలకు సంబంధించిన నక్ష(గ్రామ భూముల వివరాలు తెలిపే పటం)లు మాయమవడంతో జిల్లాలో భూ కొలతలు నత్తనడకన సాగుతున్నాయి.

హద్దులు తేల్చడంలో ఇవే కీలకం..

నిజాంకాలం(1927-30)లో మొదటిసారి భూ సర్వే జరిగింది. సర్వే నంబర్లలోని కొలత రికార్డును టిప్పన్‌ అంటారు. ఇలా గ్రామంలో వీటన్నింటిలోని భూముల కొలతలతో పాటు హద్దుల వివరాలు తెలిపే రికార్డుల ఆధారంగా ఒక గ్రామ పటం తయారు చేశారు. దీన్నే టిప్పన్‌ నక్షగా పిలుస్తున్నారు. భూ వివాదాల పరిష్కారంలో ఇప్పటికీ నిజాంకాలం నాటి దస్త్రాలే కీలకం. ప్రస్తుతం అవి జిల్లాలో అందుబాటులో లేకపోవడం సర్వే అధికారులకు సమస్యగా మారింది.

నక్ష లేకుంటే సమస్యలే

భూ దస్త్రాల నవీకరణ చేపడుతున్నా.. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్లుగా జిల్లావ్యాప్తంగా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా రెవెన్యూ, అటవీ అధికారుల మధ్య సమన్వయం కుదరక హద్దుల వివాదాలు తేలడం లేదు. గ్రామం వారీగా భూముల స్వరూపాన్ని తెలిపే నక్షలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలో సుమారు 72 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన టిప్పన్‌ నక్షలు అందుబాటులో లేవు. గతంలో రెవెన్యూ అధికారులుగా వ్యవహరించిన వీఆర్వోల వద్ద నక్షలున్నప్పటికీ ప్రభుత్వానికి ఇవ్వలేదని సమాచారం. ఇటీవల నిజాంసాగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి గ్రామనక్షను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విధంగా పలువురు వీఆర్వోలతో పాటు గతంలో పట్వారీలుగా పనిచేసిన వారి వద్ద నక్షలు, నిజాంకాలం నాటి భూ దస్త్రాలున్నట్లు రెవెన్యూ అధికారులే అనధికారికంగా చెబుతున్నారు. వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన యం త్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా..

భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో జిల్లాల వారీగా విభజించారు. జిల్లాకు పూర్తిస్థాయి భూకొలతల అధికారి లేరనే సాకుతో నిజామాబాద్‌ నుంచి వీటి పంపిణీ జరగలేదు. దీంతో భూ కొలతల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు అక్కడి కార్యాలయానికి వెళ్లి దస్త్రాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వాటి పరిరక్షణ పేరుతో ఎవరైనా సర్వేయరు వెంట వస్తేనే అందిస్తున్నారు.

లేఖ రాశాం

- శ్రీనివాస్‌, ఏడీ, భూ కొలతలు, కామారెడ్డి

నిజామాబాద్‌లోనే జిల్లా దస్త్రాలు ఉండిపోయాయి. వాటిని పంపిణీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. త్వరలో అందించే అవకాశం ఉంది. 72 గ్రామాలకు నక్షలు లేని అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాం. సర్కారు ఆదేశాలను అనుసరించి పటాలు రూపొందిస్తాం.

మొత్తం పల్లెలు 523

రెవెన్యూ గ్రామాలు 473

మొత్తం భూ విస్తీర్ణం (ఎకరాలు) 8,63,984.15

సాగు భూములు (ఎకరాలు) 5,14,336.19

ప్రభుత్వ స్థలాలు (ఎకరాలు) 2,99,644.40

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని