logo

నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ

వేసవి సెలవుల్లో చరవాణులు, వీడియోగేమ్‌లకు అతుక్కుపోకుండా తమలోని అంతర్గత ప్రతిభకు పదునుపెడుతున్నారు. సమయాన్ని వృథా కానీయకుండా సృజనాత్మకతను పెంపొందించుకుంటున్నారు. వివిధ సంస్థలు ఇస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు,

Published : 20 May 2022 03:10 IST

 వేసవి శిబిరాల్లో చిన్నారుల సందడి

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

కర్రసాములో తర్ఫీదు పొందుతూ..

వేసవి సెలవుల్లో చరవాణులు, వీడియోగేమ్‌లకు అతుక్కుపోకుండా తమలోని అంతర్గత ప్రతిభకు పదునుపెడుతున్నారు. సమయాన్ని వృథా కానీయకుండా సృజనాత్మకతను పెంపొందించుకుంటున్నారు. వివిధ సంస్థలు ఇస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు, తరగతుల్లో పాల్గొంటున్నారు. కరోనాతో రెండేళ్లుగా అవకాశం లేకపోవడంతో ఈసారి అధిక సంఖ్యలో తర్ఫీదు పొందుతున్నారు చిన్నారులు.

బాలభవన్‌లో 710 మంది
నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని చిన్నారుల ఆత్మీయనేస్తంగా పేరొందిన బాలభవన్‌లో ఏప్రిల్‌ 18న ప్రారంభమైన వేసవి శిక్షణ తరగతులకు ఈసారి 710 మంది తరలొచ్చారు. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, ఎంబ్రాయిడరీ, మెహెందీ, శ్లోకాలు, కథలు, పద్యాలు, యోగా, కర్రసాము, స్కేటింగ్‌ వంటి 30 అంశాలపై పది మంది శిక్షకులు తర్ఫీదు   ఇస్తున్నారు.  ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు  కొనసాగే తరగతులతో ప్రాంగణమంతా సందడి నెలకొంది.  పిల్లలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పర్యవేక్షకుడు ప్రభాకర్‌ తెలిపారు.

ధ్యానం సాధన చేస్తున్న బుడతలు

ఐదు అంశాల్లో..
- షణ్ముఖ ప్రియ, ఎనిమిదో తరగతి, నిజామాబాద్‌
రెండేళ్లుగా వేసవి శిక్షణ తరగతుల కోసం ఎదురుచూశాను. ఈసారి అవకాశం వచ్చింది. కర్రసాము, సంగీతం, యోగా, వృథా వస్తువులతో అందమైన ఆకృతుల తయారీ, కుట్లు అల్లికలు వంటి ఐదు అంశాలపై శిక్షణ తీసుకుంటున్నా.
ఆర్యసమాజ్‌లో  సదాచార ఆవాసం
ఇందూరు ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో కస్బాగల్లీలోని సమాజ్‌ ప్రాంగణంలో ఈ నెల 13న ప్రారంభమైన బాలబాలికల సదాచార ప్రశిక్షణ ఆవాస శిబిరం 22వ తేదీ వరకు కొనసాగనుంది. నిజామాబాద్‌తోపాటు సమీప జిల్లాలు, హైదరాబాద్‌ నుంచి మొత్తం 160 మంది వరకు చిన్నారులు చేరారు. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు గురుకుల పద్ధతిలో తర్ఫీదు ఇస్తున్నారు. ధార్మిక శిక్షణ, వేదమంత్ర పఠనం, పురాణ పురుషులు, ఆరోగ్య, ఆహార నియమాలు, పంచయజ్ఞాలు, యోగా, ధ్యానం, కర్రసాము వంటి అంశాలపై తరగతులు కొనసాగుతున్నాయి. పది రోజులపాటు కొనసాగే ఈ శిక్షణ చిన్నారుల సమగ్ర వికాసం కోసం ఉపయోగపడుతుందని సమాజ్‌ అధ్యక్షుడు రామలింగం, ఆచార్య వేదమిత్ర చెప్పారు.
మేమే హోమం చేస్తాం
- సమన్విత, నాలుగో తరగతి, హైదరాబాద్‌

వేసవి సెలవులకు బంధువుల ఇంటికి వచ్చాను. ఇక్కడ ఆర్యసమాజ్‌లో శిక్షణ ఉందని తెలిసి చేరాను. గురువులు మంచిగా నేర్పిస్తున్నారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ధైర్యం, నైపుణ్య శిక్షణ బాగుంది. మాతోనే హోమం చేయిస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ఆర్యోగ విషయాలు చాలా తెలిశాయి.
రామకృష్ణ సేవా సమితి
జిల్లాకేంద్రంలోని ద్వారకానగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ధార్మిక, నైపుణ్య శిక్షణ ఇచ్చే రామకృష్ణ సేవా సమితి, వివేకానంద యువ విభాగ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 31 వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. నిత్యం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తర్ఫీదు ఇస్తున్నారు. 96 మంది చిన్నారులు హాజరవుతున్నారు. అందమైన చేతిరాత, వేదగణితం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, ధ్యానం, గాత్రసంగీతం, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. చిన్నారుల్లో మానసిక వికాసం, నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు సమితి అధ్యక్షుడు సాయిప్రసాద్‌, శిబిర సమన్వయకర్త వసంత్‌ పేర్కొన్నారు.
భవిష్యత్తుకు రక్షణ : మనోజ్‌, తొమ్మిదో తరగతి, నిజామాబాద్‌
వేసవి శిక్షణలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇక్కడ చాలా విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా లైఫ్‌స్కిల్స్‌తో పాటు వేదగణితం, ధ్యానం, వ్యక్తిత్వ వికాస కథాపఠనం బాగుంది. ఇక నుంచి ఏటా తప్పకుండా పాల్గొంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని