logo

కలెక్టర్లు ఇచ్చిన ఎన్‌వోసీలపై కోర్టుకు..

జిల్లాలో అసైన్డ్‌ భూములకు గత కలెక్టర్లు శరత్‌, సత్యనారాయణ ఇచ్చిన ఎన్‌వోసీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని భాజపా నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. భాజపా జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన

Published : 22 May 2022 06:30 IST


సమావేశంలో మాట్లాడుతున్న భాజపా నేత వెంకటరమణారెడ్డి

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో అసైన్డ్‌ భూములకు గత కలెక్టర్లు శరత్‌, సత్యనారాయణ ఇచ్చిన ఎన్‌వోసీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని భాజపా నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. భాజపా జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రూ.400 కోట్ల నుంచి 500 కోట్ల భారీ భూ కుంభకోణం జరిగిందన్నారు. దీనికి సూత్రధారులు కలెక్టర్లు కాగా పాత్రధారులు రాజకీయ నాయకులని ఆరోపించారు. అదే అధికారులు ప్రస్తుతం పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలకు కమిషనర్లుగా పదోన్నతిపై పని చేస్తున్నారన్నారు. జిల్లాలో 153 ఎకరాల అసైన్డ్‌ భూములకు ఏ ప్రాతిపదికన ఎన్‌వోసీలు ఇచ్చారో చెప్పాలన్నారు. రామేశ్వర్‌పల్లి శివారులోని సర్వే నంబర్‌ 175/ఎలో 3.35 ఎకరాల భూమిని రమేశ్‌ అనే వ్యక్తికి కలెక్టర్‌ సత్యనారాయణ ఎన్‌వోసీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆ భూమిలో 107 ప్లాట్లు చేశారన్నారు. ఇప్పుడు వాటిని కొన్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్‌ శరత్‌ భిక్కనూరు, జంగంపల్లి, మాచారెడ్డి ప్రాంతాల్లో 150 ఎకరాలకు ఎన్‌వోసీ ఇచ్చారని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ తతంగంపై అన్ని సాక్షాలతో కోర్టుకెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీను, అసెంబ్లీ కన్వీనర్‌ కుంట లక్ష్మారెడ్డి, పట్టణాధ్యక్షుడు విపుల్‌, ఫ్లోర్‌ లీడర్‌ శ్రీకాంత్‌, కౌన్సిలర్లు నరేందర్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, రవి, నాయకులు భరత్‌, సురేష్‌, మహేష్‌గుప్తా తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని