logo

విత్తు.. పొరుగు రాష్ట్రానికి పరుగెత్తు

జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సోయా పంట సాగయ్యేది జుక్కల్‌ నియోజకవర్గంలోనే. ఏటా ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలపైనే ఆధారపడే రైతన్నలు.. ఈసారి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు విత్తనాల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

Published : 22 May 2022 06:37 IST

న్యూస్‌టుడే, జుక్కల్‌

సోయా విత్తన బస్తాలను ఇంట్లో నిల్వచేసుకుంటున్న రైతు

జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సోయా పంట సాగయ్యేది జుక్కల్‌ నియోజకవర్గంలోనే. ఏటా ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలపైనే ఆధారపడే రైతన్నలు.. ఈసారి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు విత్తనాల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే దుక్కి దున్ని భూమిని చదును చేసుకొన్నారు. పాతిక రోజుల్లో విత్తు వేస్తారనడంలో సందేహం లేదు. సహకార సంఘాల్లో రాయితీ విత్తనాల జాడ లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

బస్తా మారింది.. బరువు తగ్గింది

సోయా విత్తన బస్తా సాధారణంగా 30 కిలోలు. జె.ఎస్‌ 335 రకం విత్తనాలనే ఇక్కడి రైతులు వేస్తారు. సహకార సంఘాల్లో రాయితీ విత్తనాలు కూడా జెఎస్‌ 335 రకమే. రాయితీ విత్తనాలు రాక.. పక్క రాష్ట్రంలో వివిధ కంపెనీల బస్తాలను తెచ్చుకొంటున్నారు. 30 కిలోల బస్తాతో పాటు 20, 22, 25 కిలోల బస్తాలను రైతులు తెచ్చుకొంటున్నారు. దీంట్లోనూ 90 రోజుల్లో, 120 రోజుల్లో చేతికందే పంట ఉండటంతో రైతులు ఏదివిత్తాలో సందిగ్ధంలో ఉన్నారు. కేడీఎస్‌ 726 రకం విత్తనాలు మార్కెట్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

33 శాతం రాయితీ

గతంలో 30 కిలోల సోయా విత్తన బస్తా ధర సుమారు రూ.1800 ఉండగా 33.3 శాతం రాయితీ పోనురూ.1210కే లభించేవి. ఈసారి రాయితీ లేకపోవడంతో 30 కిలోల బస్తాకు రూ.2800 నుంచి రూ. 4100 చెల్లించాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. ఇక కేడీఎస్‌ 726 రకమైతే 20, 22 కిలోల బస్తా ధర రూ. 3050, రూ.3 వేలు పలుకుతోంది. ఏదైనా ఎకరానికి ఒక బస్తా విత్తనాలు అవసరమని రైతులు చెబుతున్నారు. నియోజకవర్గంలో దాదాపు 78 వేల ఎకరాల్లో సోయా సాగు అంచనా ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు.

పచ్చిరొట్ట ఎరువులే ఇస్తాం - నవీన్‌కుమార్‌, ఏవో, జుక్కల్‌

ఈసారి రాయితీ విత్తనాలు రావు. పచ్చి రొట్ట ఎరువులు మాత్రమే ఇస్తాం. జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంచాం. 30 కిలోల బస్తా ధర రూ.665. ఆధార్‌ కార్డు, పట్టా పాసు పుస్తకం నకలుతో ఏఈవోల వద్దకు వెళ్లి టోకెన్‌ తీసుకోవాలి.

రైతులు కోరితే తెప్పిస్తాం - బాబురావు, సొసైటీ కార్యదర్శి

రైతులు సోయా విత్తనాలు కోరితే తెప్పిస్తాం. కాకపోతే రాయితీ ఉండదు. మేం తెప్పించిన విత్తనాలకు బిల్లులు ఇస్తాం. మొలకెత్తకపోయినా.. ఏదైనా సమస్య వచ్చినా భరోసా ఇస్తాం. రైతు ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసినా.. బిల్లు మాత్రం తప్పని సరిగా తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని