logo
Updated : 23 May 2022 05:01 IST

నిఘా కన్ను నేలచూపు

బిగింపుతోనే సరి.. నిర్వహణ గాలికి  

 నిరుపయోగంగా వందలాది సీసీ కెమెరాలు

ఈనాడు డిజిటల్, కామారెడ్డి, న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్‌: శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసుశాఖ, ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు జిల్లాలో 2,890 సీసీ కెమెరాలు బిగించారు. నేను సైతంలో 2,045 ఏర్పాటు చేశారు. ఇందులో చాలావరకు ప్రస్తుతం పనిచేయడం లేదు. 

నిధుల్లేవీ లేకపోవడంతో.. 

పోలీసుల చొరవతో సీసీ కెమెరాల బిగింపునకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. నిర్వహణకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా వీటి కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులేవీ లేకపోవడం సమస్యగా ఉంది. పోలీసుశాఖ కొన్ని సమస్యాత్మాక ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధవహించి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు చేయూతనందిస్తేనే నిఘా కెమెరాలు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.

వాడుకలోకి తెచ్చేందుకు చర్యలు:  శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి

జిల్లావ్యాప్తంగా వినియోగంలో లేని సీసీ కెమెరాలను గుర్తిస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో వాడుకలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఇటీవల కాలంలో వీటి వల్లే చాలా కేసులు ఛేదించాం. నేరాల అదుపునకు ఎంతో దోహదపడుతున్నాయి. ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

క్షేత్రస్థాయిలో ఉందిలా..

 జిల్లా కేంద్రంలో మొత్తం 540 సీసీ కెమెరాలు బిగించగా వాటిలో 200 సక్రమంగా లేవు. నిత్యం ఏదో ఓ నేరం జరిగే కొత్తబస్టాండులో కొన్నాళ్లుగా పని చేయడం లేదు. ఆర్టీసీ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అశోక్‌నగర్‌ కాలనీలో రైల్వేగేట్‌ ప్రాంతంలో యువకులు రాత్రిపూట గొడవలు పడుతుంటారు. అక్కడున్న నిఘా కెమెరాలు మరమ్మతుకు నోచుకోక నేలచూపులు చూడాల్సి వస్తోంది. గొడవలు జరిగినప్పుడు పోలీసులు చేరుకునే సరికే ఎక్కడివారక్కడ పరారవుతున్నారు. రైల్వేస్టేషన్‌ ముందున్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో పాత బస్టాండు వైపు కనిపించే నిఘా కన్ను నిదురోతోంది. స్టేషన్‌రోడ్‌ మీదుగా జిల్లా ఆసుపత్రి కేంద్ర పక్క నుంచి సుభాష్‌రోడ్‌ వైపు వెళ్లే దారిలో మూలమలుపు వద్ద అసలు సీసీ కెమెరాలే లేకపోవడం గమనార్హం.  

* పిట్లం పోలీసుస్టేషన్‌ వెనుక బిగించిన సీసీ కెమెరాలు మరమ్మతులు లేక మరుగునపడ్డాయి. 

* భిక్కనూరు మండల కేంద్రంలోని 21 కెమెరాల్లో ఒక్కటీ పనిచేయక చాలా రోజులవుతోంది. ఇదే మండలంలోని బస్వాపూర్‌లోనూ 10 ఉండగా అన్నీ నిరుపయోగంగా మారాయి. 

* బాన్సువాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో 916కు గాను 688 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పట్టణ పరిస్థితిని పరిశీలిస్తే 115 కెమెరాలుండగా వాటిలో 80 మాత్రమే పనిచేస్తున్నాయి. 

* ఎల్లారెడ్డిలో నూతనంగా కెమెరాల బిగింపునకు కార్యాచరణను సిద్ధం చేశారు. 

* తాడ్వాయిలోని శబరిమాత ఆలయం దారిలో తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్నా సీసీ కెమెరాల మరమ్మతులపై ధ్యాసే లేదు. 

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం.. ప్రతిచోట నిరంతరం నిఘా కొనసాగాలంటే వీటిని బిగించుకోవడమే శాశ్వత పరిష్కారం.. ఇవన్నీ పోలీసు అధికారులు తరచూ చెప్పే మాటలు. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా వాటి నిర్వహణ గాలికొదిలేయడంతో నిఘా నేలచూపులు చూస్తున్న వైనంపై ‘ఈనాడు’ పరిశీలన కథనం.

అక్కడ ఇలా..

‘‘ఆ గ్రామంలో సీసీ కెమెరాలున్నాయన్న ధీమాతో గ్రామస్థులు నిర్భయంగా తిరుగుతుంటారు. ఇంతలోనే ఓ మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును దుండగులు తెంపుకెళ్లారు. పోలీసులు హడావుడిగా వచ్చి సీసీ ఫుటేజీ కోసం వెతికితే అవి పనిచేయడం లేదని తేలింది. దీంతో నెలన్నరగా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇదంతా జిల్లాలోని బీర్కూర్‌ మండలం చించోలి గ్రామంలో చోటు చేసుకుంది.’’ 

ఇక్కడ గంటలోనే.. 

‘‘జిల్లా కేంద్రంలోని రాంమందిర్‌ సమీపంలో ఈ నెల 17న తెల్లవారుజాము ప్రాంతంలో పులి రవి అనే యువకుడిని ఓ గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడు. అక్కడ జరిగిందంతా సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. దాని ఆధారంగా నిందితుడు పాండును గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. దీనికి ప్రధాన కారణం సంఘటనా స్థలంలో ఓ వ్యాపారి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఫుటేజీ వల్లే.’’  

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని