logo

మిల్లుల్లో లారీలు.. కల్లాల్లో రైతులు

ధాన్యం సేకరణకు లారీల కొరత వేధిస్తోంది. కాంటా పూర్తయినా కల్లాల్లోనే ఉంటున్నాయి. లారీలు సమయానికి రాకపోవడంతో అన్నదాతలు కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. రెండు మూడు రోజులుగా

Published : 23 May 2022 04:10 IST

అన్నదాతలను వెంటాడుతున్న వర్షం భయం 

కాంటా చేసినా కదలని సంచులు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌ : ధాన్యం సేకరణకు లారీల కొరత వేధిస్తోంది. కాంటా పూర్తయినా కల్లాల్లోనే ఉంటున్నాయి. లారీలు సమయానికి రాకపోవడంతో అన్నదాతలు కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. రెండు మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై గాలులు వీస్తూ చినుకులు కురుస్తున్నాయి. ఉన్నట్లుండి వర్షం పడితే ధాన్యం నీటిపాలవుతాయని ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌ కొనుగోళ్ల ప్రక్రియ ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభమైంది. అధికారులు హడావిడిగా అన్ని ఏర్పాటు చేశారు. కానీ మిల్లర్ల పేచీతో కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారు. 

ధాన్యం దించుకోవడంలో జాప్యం

ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వెళ్తున్న లారీలు రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉంటున్నాయి. అక్కడ వడ్లను పరీక్షిస్తుండటంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. చిన్న మరపట్టే యంత్రంలో వేసి ఎన్ని బియ్యం వస్తున్నాయో చూస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. నూక శాతం అధికంగా వచ్చే లారీల నుంచి ధాన్యాన్ని దింపుకోవడం లేదంటున్నారు. సదరు రైతులతో మాట్లాడి అడిగినంత తరుగు ఇచ్చిన తర్వాతే దించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరి కొన్ని మిల్లుల్లో ధాన్యం ఎలా ఉన్నా క్వింటాకు 2 నుంచి 3కిలోల తరుగు తీస్తున్నారు. 

అధికంగా తూకం.. 

జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధికంగానే తూకం వేస్తున్నారు. వాస్తవానికి సంచికి 40.600 కిలోలు తూకం వేయాలి. ఇందులో ధాన్యం 40 కిలోలు, సంచి బరువు 600 గ్రాములు. అన్ని కేంద్రాల్లో 42 నుంచి 42.200 కిలోల వరకు తూకం వేస్తున్నారు. ఇలా అధికంగా వేస్తే మిల్లర్లు తరుగు విధించరని చెబుతున్నారు. కానీ మిల్లుకు వెళ్లిన తర్వాత మళ్లీ మూడు కిలోల వరకు ఎందుకు కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 

రెండు రోజులుగా రాలేదు: భూపాల్, పాత రాజంపేట

నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. 361 బస్తాల దిగుబడి వచ్చింది. లారీలు రాకపోవడంతో ఇబ్బందవుతోంది. ఇప్పుడు మా కేంద్రంలో 800 బస్తాలు నిల్వ ఉన్నాయి. ఓ వైపు వర్షం సూచన దడ పుట్టిస్తోంది. ఒక్కో టార్పాలిన్‌ను రోజుకు రూ.30 అద్దెకు తెచ్చి కప్పుతున్నాం.

కొనుగోళ్లు పెరగడంతోనే రద్దీ: జితేంద్రప్రసాద్, డీఎం, పౌరసరఫరాల శాఖ, కామారెడ్డి

మొన్నటి వరకు కొనుగోళ్ల అంతగా లేవు. ఈ వారం నుంచి పెరగడంతో మిల్లుల్లో రద్దీ ఏర్పడింది. ధాన్యం దించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒక రోజు వ్యవధిలో దించుకోవాలని చెప్పాం. ధాన్యం సేకరణ సజావుగా సాగుతోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని