logo

రూ.3.95 కోట్లకు రికార్డుల్లేవ్‌

ఉపాధిహామీ పథకం నిధుల ఖర్చుపై సామాజిక తనిఖీల్లో లోపాలు వెలుగుచూస్తున్నాయి. డిచ్‌పల్లి మండలంలో రికార్డులు సమర్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్న నలుగురు ఏపీవోలకు

Published : 23 May 2022 04:52 IST

ఇచ్చిన వాటిలోనూ తేడాలు

వెలుగులోకి వచ్చిన లోపాలు

ఈనాడు, నిజామాబాద్, న్యూస్‌టుడే, డిచ్‌పల్లి గ్రామీణం: ఉపాధిహామీ పథకం నిధుల ఖర్చుపై సామాజిక తనిఖీల్లో లోపాలు వెలుగుచూస్తున్నాయి. డిచ్‌పల్లి మండలంలో రికార్డులు సమర్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్న నలుగురు ఏపీవోలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. వీరిలో ఇద్దరిని సస్పెండ్‌  చేసిన విషయం తెలిసిందే. 34 గ్రామ పంచాయతీల్లో మూడేళ్లలో రూ.16.43 కోట్ల విలువైన పనులు జరిగాయి. వీటిల్లో రూ.3.95 కోట్ల పనులకు దస్త్రాలు సమర్పించలేదు. రికార్డుల నిర్వహణ బాధ్యత ఏపీవోలదే కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో తేడాలున్న సందర్భంలో అధికారులు ఏం చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరోనాతో ఆడిట్‌ ఆలస్యమైందని, కంప్యూటర్‌ ఆపరేటర్ల కొరత ఉందంటూ ఉద్యోగులు చెప్పుకొస్తుండటం గమనార్హం. 

ఇచ్చిన దస్త్రాల్లోనూ పొరపాట్లు

రూ.16.43 కోట్ల నిధుల ఖర్చులో రూ.12.48 కోట్ల విలువకు మాత్రమే దస్త్రాలు సమర్పించారు. వీటిలోనూ పొరపాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఎంత మొత్తంలో తేడా ఉంది. పొరపాట్లకు  సంబంధిత ఉద్యోగులు ఏమి సమాధానం చెబుతారనేది చూడాలి. నిధుల వ్యయంలో జరుగుతున్న తప్పిదాలపై కేవలం తాత్కాలిక ఉద్యోగులనే బాధ్యులుగా చేస్తుండటం గమనార్హం.  

రెండో రోజూ అదే తీరు..

మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శనివారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో 8 పంచాయతీల పరిశీలన పూర్తవ్వగా.. ఆదివారం రాత్రి 9 గంటల వరకు 29 పంచాయతీలవి పూర్తయింది. డీఆర్‌డీవో చందర్‌నాయక్, ఎంపీపీ భూమన్న, సహాయ విజిలెన్స్‌ అధికారి నారాయణ, ఎంపీడీవో నాగేంద్రప్ప తనిఖీలను పరిశీలించారు. రికార్డులు చూపకపోవడాన్ని గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిచ్‌పల్లి మండలంలో జరిగిన అక్రమాలపై దిల్లీలోని కేంద్ర విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానని ఎంపీపీ భూమన్న తెలిపారు. 

మస్టర్ల మతలబు

మేట్ల నుంచి ఏపీవోల వరకు పనుల్లో నిర్లక్ష్యం చూపారు. 210 వరకు ఎంబీ రికార్డులను అందించలేదు. ఒకరి పేరుపై మరొకరు పనిచేశారు. మస్టర్ల నిర్వహణ సరిగా లేదు. చనిపోయిన వారి పేర్లున్నాయి. కొన్నిచోట్ల చేయని పనులకు, మరికొన్ని చోట్ల ఒక పనికి రెండ్లు బిల్లులు రాశారు. తనిఖీల సందర్భంలో వివరాలు ఇవ్వటానికి సిబ్బంది రాలేదు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని