logo

ఇందూరును వరించింది

ధాన్యాగారంగా పేరున్న ఇందూరు జిల్లాను ‘వరి’స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పంట కాలనీల ప్రయోగానికి సంకల్పించింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో 80 శాతం సాగయ్యే వరి పంటను పోత్సహించేందుకు పచ్చజెండా

Published : 23 May 2022 04:52 IST

పంట కాలనీకి పచ్చజెండా

 జిల్లాలో 5.09 లక్షల ఎకరాల్లో సేద్యం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం: ధాన్యాగారంగా పేరున్న ఇందూరు జిల్లాను ‘వరి’స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పంట కాలనీల ప్రయోగానికి సంకల్పించింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో 80 శాతం సాగయ్యే వరి పంటను పోత్సహించేందుకు పచ్చజెండా ఊపింది. వాతావరణం, నేలలు, నీటి వసతి, మార్కెటింగ్‌ ఆధారంగా ప్రాంతాల వారీగా పంట కాలనీ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా వానాకాలం సీజన్‌కు సంబంధించి వరి వేసుకునేందుకు సర్కారు సమ్మతించింది. తర్వాతి స్థానం సోయా, మొక్కజొన్న, పసుపు పంటలన్నీ కలిపి 20 శాతం లోపే ఉండడం గమనార్హం. బోధన్, భీమ్‌గల్‌ డివిజన్లలో 2300 ఎకరాల్లో పత్తి వేసేలా రైతులను సమాయత్తం చేయనున్నారు.

జిల్లాలో వానాకాలం సీజన్లో 5.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో వరి ఒక్కటే 4.01 లక్షల ఎకరాల మేర పండనుంది. గతేడాది 3.88 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ సారి మరింత పెరిగే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. జిల్లాలో ప్రతి మండలంలో ఏమూలన చూసినా ఈ పంటే అధిక విస్తీర్ణంలో వేస్తున్నారని 2020 వానాకాలం సీజన్‌లో చేసిన పంటల సర్వేలో వెల్లడైంది. అందుకనుగుణంగా ఈ పంటను ప్రోత్సహించేందుకు అవసరమైన కార్యాచరణ తయారు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖకు సూచించింది. వచ్చే నెల మొదటి వారానికి నైరుతి రుతుపవనాలు జిల్లాను చేరనుండటంతో అన్నదాతలను సన్నద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

సమృద్ధిగా నీటి వనరులు

జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్‌తో పాటు, దిగువన శ్రీరాంసాగర్‌ ఉండటం ఇక్కడి రైతులకు కలిసివస్తోంది. గుత్ప, అలీసాగర్‌ వంటి మధ్య తరహా, సుమారు 22 చిన్నతరహా ఎత్తిపోతల పథకాల వల్ల 90 శాతం పల్లెలు జలకళను సంతరించుకున్నాయి. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం జలాలు మంచిప్ప ద్వారా అందితే మిగతా పది శాతం భూములూ సస్యశ్యామలం కానున్నాయి. వీటికి తోడు సాధారణ వర్షాలు పడితే 1220 చెరువులు, కుంటలు, 1.65 లక్షల బోరుబావులతో సేద్యం వర్ధిల్లుతోంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలేసేందుకు అన్నదాతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జలాశయాలు, చెరువుల కింద వరి తప్ప ఇతర పంటలు పండే పరిస్థితి లేదు. 

 12 లక్షల మెట్రిక్‌ టన్నుల  ఉత్పత్తి

రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తయ్యే జిల్లాలో నిజామాబాద్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్క మన జిల్లాలోనే ప్రస్తుతం 10 లక్షల మె.ట. ధాన్యం పండుతోంది. ఇందులో 7 లక్షల మె.ట. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తోంది. రెండు సీజన్లు కలుపుకొంటే 20 లక్షల మె.ట. దాటే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మరో 15 వేల ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈ లెక్కన 4.01 లక్షల ఎకరాల్లో 12 లక్షల మె.ట. పండనుంది.

 రైస్‌మిల్లులు  260

ఉమ్మడి నల్గొండ జిల్లా తర్వాత అత్యధికంగా రైస్‌మిల్లులున్న జిల్లాగా నిజామాబాద్‌కు పేరుంది. ఇక్కడ 260 వరకు ఉన్నాయి. ఇందులో పారాబాయిల్డే సుమారు 200 వరకు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 6 లక్షల మె.ట. వరకు మర ఆడించే అవకాశం ఉంది. మరో 50 మిల్లులు ఏర్పాటైతే పండిన పంటంతా ఇక్కడే బియ్యంగా మార్చి ఎగుమతి చేసుకునే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అనుబంధ పరిశ్రమ ద్వారా సుమారు 5 వేల మంది ప్రత్యక్షంగా, మరో 2 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 

పెట్టుబడులు తగ్గించుకునేలా వరి సాగు:  తిరుమల ప్రసాద్, ఇన్‌ఛార్జి వ్యవసాయాధికారి

పంట కాలనీల్లో భాగంగా నిజామాబాద్‌ను వరి కోసం ఎంపిక చేశారు. ఈ సీజన్‌లో దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకు తగ్గట్లు వరిని ప్రోత్సహించేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని నాట్లు పోసుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. భాస్వరం నిల్వలు తగ్గించుకోవాలని చెబుతున్నాం. నాటే పద్ధతికి స్వస్తి పలికి వెదజల్లడం, డ్రమ్‌ సీడర్‌ ద్వారా విత్తుకోవాలని అవగాహన సదస్సులు నిర్వహించి వివరిస్తున్నాం. నల్లరేగడి నేలలున్న బోధన్, భీమ్‌గల్‌ ప్రాంతాల్లో పత్తి పండించాలని రైతులకు సూచిస్తున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని