logo

మీ ఆరోగ్యం.. మా చేతుల్లో

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నారు. సాధారణ సేవలకే పరిమితం కాకుండా ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చయ్యే అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. స్త్రీవైద్యనిపుణులు, జనరల్‌ సర్జన్‌, చెవిముక్కు, ఎముకల విభాగాల్లో కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, మెదక్‌ దవాఖానాలతో సమానంగా ఇక్కడ మోకీలు మార్పిడి చికిత్సలు చేస్తున్నారు.

Published : 24 May 2022 05:44 IST

 పేదోడి సొంతం.. కార్పొరేట్‌ వైద్యం  
 జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నారు. సాధారణ సేవలకే పరిమితం కాకుండా ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చయ్యే అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. స్త్రీవైద్యనిపుణులు, జనరల్‌ సర్జన్‌, చెవిముక్కు, ఎముకల విభాగాల్లో కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, మెదక్‌ దవాఖానాలతో సమానంగా ఇక్కడ మోకీలు మార్పిడి చికిత్సలు చేస్తున్నారు.

ప్రసవాల్లోనూ..

స్త్రీవైద్యనిపుణుల విభాగం ఆధ్వర్యంలో తొమ్మిది మంది వైద్యులు, ఆరుగురు పీజీ వైద్యుల బృందం పనిచేస్తున్నారు. ఇటీవల ఒక మహిళకు ప్రసవ సమయంలో ఒక్కసారిగా గర్భసంచి కూడా బిడ్డతోసహా బయటకొచ్చింది. డాక్టర్‌ సరోజ విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేశారు.

* కొవిడ్‌తో బాధపడుతున్న గర్భిణికి శస్త్రచికిత్స చేయగా ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. కాగా పిల్లలు కొవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్త వహించారు.

నిపుణులైన వైద్యులు..

జిల్లా ఆసుపత్రిలో సీనియర్‌ వైద్యులు అందుబాటులో ఉన్నారు. గాంధీ, ఉస్మానియాలో పనిచేసిన అనుభవం ఉన్నవారు జిల్లాలో సేవలందిస్తున్నారు. ప్రజలు ఈ విషయం గమనించి సేవలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

* అత్యాధునిక పరికరాలు ఆపరేషన్లు చేసేందుకు వీలుగా అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చారు. సీయామ్‌,  అత్యాధునిక వెంటిలేటర్లు, సీపాప్‌ యంత్రాలు, ఈసీజీ, 2డీఈకో వంటివి ఉన్నాయి.


మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు

చికిత్స అనంతరం నడవడానికి సిద్ధంగా ఉన్న మహిళలు

20 రోజుల్లో ఐదుగురికి మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. మాక్లూర్‌ మండలం మెట్‌పల్లికి చెందిన లలిత, మాక్లూర్‌ మండలం దుర్గానగర్‌కు చెందిన నీలాబాయి, మెండోర మండల కేంద్రానికి చెందిన గంగామణి కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు. వీరికి ఎముకల వైద్యులు నాగేశ్వర్‌రావు, కిరణ్‌, మత్తు వైద్యులు కిరణ్‌ మాదాల శస్త్రచికిత్సలు చేశారు. ప్రైవేటులో ఒక్కొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చయ్యేది.


లక్ష్మి ప్రాణాలు నిలిపారు

ఇటీవల నిజాంసాగర్‌ మండలంలో ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో చిల్లర్గ గ్రామానికి చెందిన లక్ష్మి(35) తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ప్రభుత్వ జనరల్‌ దవాఖానాకి తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదంలో పేగులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారినట్లు వైద్యులు గుర్తించారు. జనరల్‌ సర్జరీ విభాగం వైద్యులు విజయ్‌కుమార్‌, సునీల్‌, రాంచందర్‌, కిరణ్‌ మూడు గంటల పాటు కష్టపడి శస్త్రచికిత్స చేశారు. ఇదే ప్రైవేటులో చేస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల ఖర్చవుతుంది. ప్రస్తుతం లక్ష్మి కోలుకోవడంతో ఇంటికి పంపించారు.


క్యాన్సర్‌ చికిత్సలు..

* నిజామాబాద్‌ నగరానికి చెందిన హరిబాబు రాథోడ్‌(64) గతంలో అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. మోచేతి వద్ద గడ్డగా మారి అది కాస్త క్యాన్సర్‌గా తేలింది. ఇలాంటి క్యాన్సర్‌ లక్షల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఈయనకు డాక్టర్‌ సునీల్‌ చికిత్స చేశారు.
* నిజాంసాగర్‌కు చెందిన సవిత(12) ఫ్యారాథైరాయిడ్‌ కార్చినోమా క్యాన్సర్‌ (గొంతుభాగంలో వచ్చే క్యాన్సర్‌)తో బాధపడుతుంది. ఇది చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్‌గా గుర్తించారు. చెవి, ముక్కు, గొంతు వైద్యులు కృష్ణ, సునీల్‌ కలిసి శస్త్రచికిత్స చేసి బాలిక ప్రాణాలు కాపాడారు. చిన్నవయసులోనే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ప్రైవేటులో ఈ చికిత్స ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని