logo

మియా సమయస్ఫూర్తి..కావాలి అందరికీ స్ఫూర్తి..

అమెరికాలోని యువాల్డీ నగరంలో ఒక పాఠశాలలో ఒక యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అదే బడిలో చదివే మియా సెరిల్లో అనే 11 ఏళ్ల అమ్మాయి ఒక విద్యార్థిని. దుండగుడు కాల్పులు జరుపుతుంటే   తప్పించుకోవడానికి అప్పటికే రక్తపు మడుగులో ఉన్న తన స్నేహితురాలి రక్తం

Updated : 29 May 2022 06:11 IST

 యువాల్డీ కాల్పుల ఘటన అనుభవ పాఠం

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

అమెరికాలోని యువాల్డీ నగరంలో ఒక పాఠశాలలో ఒక యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అదే బడిలో చదివే మియా సెరిల్లో అనే 11 ఏళ్ల అమ్మాయి ఒక విద్యార్థిని. దుండగుడు కాల్పులు జరుపుతుంటే   తప్పించుకోవడానికి అప్పటికే రక్తపు మడుగులో ఉన్న తన స్నేహితురాలి రక్తం తనకు అంటించుకుని చనిపోయినట్లు నటించింది. దుండగుడు  వెళ్లిపోగానే కాల్పుల్లో మృతిచెందిన టీచర్‌ ఫోన్‌ తీసుకుని 911కు     ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వారు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

పదకొండేళ్ల అమెరికా అమ్మాయి సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు మన పిల్లల సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో సమీక్షించుకునే పరిస్థితి కల్పించింది. వాస్తవానికి ఇలాంటి ఘటనల్లో కంగారులో అనవసరంగా ప్రమాదంలో పడే పరిస్థితులు కల్పించుకుంటారు. కానీ, ఆ చిన్నారి సమయోచితంగా వ్యవహరించిన తీరు తమ పిల్లల్లోనూ అలవడాలని అభిలషించే వారి సంఖ్య అధికంగానే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. కాల్పులు, బాంబుదాడులు వంటి ఘటనలే కాకపోయినా... వరదలు, అగ్ని ప్రమాదాలు, అత్యాచారాలు, వేధింపుల వంటి ఘటనల్లో స్పందించి  కట్టడిచేసే సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరముంది.

మన చదువుల్లో నేర్పుతున్నదేమిటి?:  8వ తరగతిలో ‘చట్టం న్యాయం’ అనే అంశంలో గొడవ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ సన్నివేశాన్ని ఇస్తారు. 9వ తరగతిలో శిశు, మహిళా చట్టాల గురించి వివరించారు. రహదారి భద్రత, చట్టాలు, విపత్తు నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ వంటివి వివరించారు. అందులోనే అపరిచిత వస్తువులపై డయల్‌ 100కు అగ్ని ప్రమాదం జరిగితే 101కు సమాచారం ఇవ్వాలని పాఠ్యాంశాల్లో వివరించారు. వీటిని నిజ జీవితంలోకి అన్వయించుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. వీటిని జీవిత పాఠాలుగా కాకుండా ఇంకా మార్కుల సాధన కోసమనే భావనతో నేర్పించడమే కారణం. ప్రయోగాత్మకంగా మాక్‌డ్రిల్‌ నిర్వహించి వివరిస్తే విద్యార్థుల మదిలో నాటుకుపోతుంది. బోర్డుపై రాసి చదువుమంటే ఇతర పాఠ్యాంశాల మాదిరిగానే నేర్చుకుంటున్నారు.

కొవిడ్‌తో నిలిచిన పోలీసు శిక్షణ...:  ‘స్టూడెంట్‌ పోలీసు కేడెట్‌’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టింది. అలా నిజామాబాద్‌ జిల్లాలో 20 బడుల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది. వేధింపులు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో పోలీసుల మాదిరిగా ఈ విద్యార్థి పోలీసు తక్షణం స్పందించాలి. పోలీసులకు సమాచారం అందించి నియంత్రించాలి. 2018లో మొదలైన కార్యక్రమంలో 8, 9వ తరగతుల్లో చురుకైన విద్యార్థుల్లో 48 మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు.  జైలు సందర్శన, బెటాలియన్‌ శిక్షణ, చట్టాలు, బాధ్యతలపై బోధన కోర్సులో భాగం. ఈ శిక్షణ కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయింది. విద్యార్థి పోలీసులు సమాజాన్ని జాగృతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించడం,   నేర నియంత్రణలో పోలీసులకు సహకారులుగా ఉంటారని భావించారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఈ విధానాన్ని  ప్రారంభిస్తే ప్రయోజనం.

వివిధ దేశాల్లో :  అమెరికాలో పాఠశాల స్థాయిలోనే పిల్లలకు అత్యవసర ఫోన్‌ నంబర్లపై అవగాహన కల్పిస్తారు. ఏ చిన్న సమస్య వచ్చినా 911కు ఫోన్‌ చేస్తారు. అందుకే దీన్ని ఏంజిల్‌(దైవదూత) నంబరు అంటారు. ఫిన్లాండులో చదువుకంటే ముందు స్వయంగా నిలదొక్కుకునే సామర్థ్యాలు నేర్పిస్తారు.

సదస్సులు నిర్వహిస్తున్నా...:  ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, సైబర్‌ నేరాలు, బాల్య వివాహాలు, గృహహింస కేసులు నమోదవుతుంటాయి. ఇలాంటి నేరాల్లో బాలలు నేరుగా ఫోన్‌ చేసి ఒక్క ఘటనను నియంత్రించిన సందర్భాలు లేవు. కనీసం తోటి బాలికకు ఇష్టం లేకపోయినా వివాహం జరిపిస్తున్నారనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇక రోడ్డు ప్రమాదం జరిగి రక్తపు మడుగులో ఒక వ్యక్తి విలవిల్లాడుతుంటే 108కు ఫోన్‌ చేయాలనే స్పృహ ఉండటంలేదనేది వాస్తవం. పలు నేరాల నియంత్రణకు నిర్దేశించిన ఫోన్‌ నంబర్లపై పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించడానికి పోలీసు, ఐసీడీఎస్‌, న్యాయశాఖలు సదస్సులు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు సమయస్ఫూర్తిగా స్పందించే సామర్థ్యాలు పెంచుతున్నాయో, లేదో సమీక్షించాల్సిన అవసరముంది.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
- ఈశ్వర్‌, విద్యార్థి పోలీసు సమన్వయాధికారి

విద్యార్థి పోలీసు శిక్షణ కరికులం ఆత్మవిశ్వాసం పెంపొందించేదిగా ఉంది. సమాజంలోని నేరాలు, విపత్తులు సహా పోలీసులు నిర్వర్తించే బాధ్యతలపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. కళ్లెదుట జరిగే నేరాలు, ప్రమాదాలు, వేధింపులు, మోసాలను నియంత్రించే విషయ పరిజ్ఞానం లభిస్తుంది. కొవిడ్‌తో కొంత విరామం వచ్చింది. పునప్రారంభిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు స్థైర్యాన్నిస్తుంది.

విపత్తుల నిర్వహణపై అవగాహన
- లింగం, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సహాయ కమిషనర్‌

విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించే తీరుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పనిచేస్తుంది. 6-9 తరగతుల్లో విద్యార్థుల్లో ఒక్కో తరగతి నుంచి 8 మంది చొప్పున యూనిట్‌కు 32 మందికి ఇచ్చే శిక్షణ సమాజంలో అందరిలో అవగాహన పెంచడానికి దోహదం చేస్తుంది. మా విద్యార్థులు పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పరిశీలించి నివేదిక రాస్తారు. ఇలా పిల్లలందరికీ ప్రమాదాలు, విపత్తుల్లో స్పందించే తీరు నేర్పాలి.

గతేడాది అధికారికంగా నమోదైన నేరాల తీరు

హత్యలు : 44
హత్యాయత్నాలు : 48
అత్యాచారాలు : 37
న్యూసెన్సు : 17,959
పోక్సో : 2
ఈవ్‌టీజింగ్‌ : 21
అడ్డుకున్న బాల్య వివాహాలు :  14

టోల్‌ఫ్రీ నంబర్లు...

పోలీసు : 100
అగ్నిమాపక : 101
అంబులెన్సు : 102, 108
మహిళా సహాయ కేంద్రం : 181
ఛైల్డ్‌లైన్‌ (చిన్నారులకు) : 1098
విపత్తు సహాయ కేంద్రం : 1077
రాష్ట్ర విపత్తు నియంత్రణ కేంద్రం : 1070

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని