logo

ఇందూరు ఓటు విలువ 3288

ఇప్పుడు గల్లీ నుంచి దిల్లీ దాకా ఒకటే చర్చ. ఆసక్తికరమైన లెక్కలు. ప్రజలెవరూ పాల్గొనకున్నా... దేశ అత్యున్నత పదవికి జరిగే పోరుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అధికార, విపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి

Published : 24 Jun 2022 06:11 IST

ఇప్పుడు గల్లీ నుంచి దిల్లీ దాకా ఒకటే చర్చ. ఆసక్తికరమైన లెక్కలు. ప్రజలెవరూ పాల్గొనకున్నా... దేశ అత్యున్నత పదవికి జరిగే పోరుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అధికార, విపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. 16వ రాష్ట్రపతి ఎన్నికలో ఆయా పార్టీల చట్టసభ సభ్యుల బలాబలాలతో గెలుపెవరిదో ఒక స్పష్టత వచ్చింది. జులై 18న జరిగే పోలింగ్‌లో ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందూరు నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి ఓటు విలువ ఎంత? అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తుంది. దీనిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

సాధారణంగా జరిగే ఎన్నికలకు, రాష్ట్రపతి ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఒక ఓటరు విలువ ఒక అభ్యర్థికి ఒకటిగానే పరిగణిస్తారు. కానీ ఎలక్టోరల్‌ కాలేజీ (రాష్ట్రపత్రి ఎన్నిక విధానం)లో... ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఓటు విలువ మారుతుంది. ఎమ్మెల్యే ఓటు విలువను 1971లోని రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేల స్థానాలతో భాగిస్తారు. మళ్లీ ఆ విలువను 1000తో భాగించగా వచ్చిన విలువ ఎమ్మెల్యే ఓటు విలువ అవుతుంది.
ఎమ్మెల్యేది   132
రాష్ట్ర జనాభా ఆధారంగా లెక్కిస్తే రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఓటు విలువ 132గా వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ లెక్కన మన జిల్లా నుంచి ఓటు హక్కు వినియోగించుకునే శాసనసభ్యులందరి ఓటు విలువ 1188 అవుతుంది.
ముగ్గురు ఎంపీలు..
ఉమ్మడి జిల్లా పరిధి నిజామాబాద్‌, జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అంటే ఇద్దరు ఎంపీ (లోక్‌సభ)లు ఉన్నారన్నమాట. రాజ్యసభకు ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎలక్టోరల్‌ కాలేజీలో ఒక ఎంపీ ఓటు విలువ 700గా నిర్ణయించారు. ముగ్గురు ఎంపీల విలువ 2100 కానుంది.  
ఎలా  గణిస్తారంటే?
ఎంపీల ఓటు విలువను ప్రత్యేకంగా గణిస్తారు. అన్ని రాష్ట్రాల శాసన సభ్యుల మొత్తం ఓటు విలువను పార్లమెంటులోని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో భాగిస్తారు. ఈ లెక్కన దేశంలోని శాసనసభ్యుల మొత్తం ఓటు విలువ 5,43,231 కాగా పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య 776తో భాగించగా ఓటు విలువ 700గా తేలింది.  గతసారి 708 ఉండగా జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీ స్థానాలు లేకపోవడంతో విలువలో మార్పు వచ్చింది.


పార్టీల వారీగా చూస్తే...
పార్టీ ఎమ్మెల్యే ఓటు మొత్తం ఓటు
స్థానాలు విలువ విలువ
తెరాస 9 132 1188
(ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచినా తెరాసలో కొనసాగుతున్నారు)

ఎంపీ ఓటు విలువ
భాజపా 1 700 700
తెరాస 2 1400 1400

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని