logo

ఆటో హారన్‌ మోగించారని కత్తితో దాడి

నిజామాబాద్‌ వర్ని రోడ్డులో దారుణ ఘటన చోటు చేసుకొంది. ఆటో హారన్‌ మోగించారనే కారణంతో బుధవారం అర్ధరాత్రి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవ్వగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదో ఠాణా ఎస్సై రాజేశ్వర్‌ గౌడ్‌ కథనం ప్రకారం..

Published : 24 Jun 2022 06:25 IST

 వర్ని రోడ్డులో ఘటన

చికిత్స పొందుతున్న బాధితుడు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ వర్ని రోడ్డులో దారుణ ఘటన చోటు చేసుకొంది. ఆటో హారన్‌ మోగించారనే కారణంతో బుధవారం అర్ధరాత్రి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవ్వగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదో ఠాణా ఎస్సై రాజేశ్వర్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. నాగారానికి చెందిన బట్టు సాయికుమార్‌ తన స్నేహితులు భాను, ప్రభాకర్‌, విష్ణు, ప్రమోద్‌, సాయికృష్ణలతో కలిసి ఓ వివాహ విందుకు హాజరయ్యారు. అనంతరం వీరందరు కలిసి రైల్వేస్టేషన్‌ సమీపంలో టీ తాగేందుకు ఆటోలో బయలుదేరారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీరి ఆటో వర్ని రోడ్డులోని సాయినగర్‌ దాటుతుండగా ఎదుట రెండు ద్విచక్రవాహనాలు అడ్డంగా ఉన్నాయి. ఆటో నడుపుతున్న వ్యక్తి హారన్‌ మోగించగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులు ఆటోను ఆపారు. హారన్‌ ఎందుకు మోగించారంటూ గొడవకు దిగారు. ఈ క్రమంలో సాయికృష్ణ, విష్ణుపై కత్తితో దాడి చేశారు.
అజ్జు అండతో..  నగరంలోని పేయింటర్‌ కాలనీకి చెందిన ఖాజా కత్తితో దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే గొడవ జరిగేలా మాత్రం అజ్జు రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై గతంలోనే హత్యాయత్నం, దాడుల కేసులు ఉన్నాయి. ఇతని అండతోనే కత్తితో దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఖాజా, జుబేర్‌, సాదల్‌, సలాం, ఫిరోజ్‌, అజ్జును నిందితులుగా చేర్చామని సీఐ నరేష్‌ తెలిపారు. అజ్జుపై పీడీ అస్త్రాన్ని ప్రయోగించనున్నట్లు.. ప్రస్తుతం అతను మినహా మిగతా అందరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై సీపీ నాగరాజు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీపీ వెంకటేశ్వర్‌తో వివరాలు సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని